ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీనియార్టీ ఉందని నర్సును సర్జన్‌ చేస్తారా? - ప్రవీణ్‌ప్రకాశ్‌ తీరుపై హైకోర్టు అసంతృప్తి - Praveen Prakash on GO 76

AP High Court Questions to Praveen Prakash: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించే జీవో 76పై వివరణ ఇచ్చేందుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. జీవో 76 విషయంలో లోతుగా పరిశీలన చేయాలని ప్రవీణ్‌ప్రకాశ్‌కు సూచించింది.

AP_High_Court_Questions_to_Praveen_Prakash
AP_High_Court_Questions_to_Praveen_Prakash

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 9:04 AM IST

సీనియార్టీ ఉందని నర్సును సర్జన్‌ చేస్తారా? - ప్రవీణ్‌ప్రకాశ్‌ తీరుపై హైకోర్టు అసంతృప్తి

AP High Court Questions to Praveen Prakash :సానుభూతి, సమన్యాయం పేరు చెప్పి విద్యా సంస్థల్లో పదోన్నతులు ఇవ్వడం సరికాదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కు హైకోర్టు తేల్చిచెప్పింది. లైబ్రేరియన్లకు పుస్తకం కవర్‌ పేజీపై ఏముందో తెలుస్తుందికాని లోపల ఉన్న విషయంపై ఏమి అవగాహన ఉంటుందని ప్రశ్నించింది. పాఠ్యాంశాలపై లైబ్రేరియన్లు, పీడీలకు అవగాహన ఉండదని, వారు ప్రిన్సిపల్స్‌గా నియమితులయితే విద్యార్థులకు అర్థమయ్యేలా అధ్యాపకులు చెబుతున్నారా? లేదా? అనే విషయాన్ని ఏవిధంగా అంచనా వేయగలరని ప్రశ్నించింది.

సీనియార్టీ ఉందన్న కారణంతో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌కు సర్జన్‌గా పదోన్నతి కల్పించలేరు కదా అని వ్యాఖ్యానించింది. ఐఐటీలు, ఐఏఎంలు, వైద్య కళాశాలలకు లైబ్రేరియన్లు, పీడీలు నేతృత్వం వహించిన సందర్భాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. జీవో 76 విషయంలో లోతుగా పరిశీలన చేయాలని ప్రవీణ్‌ప్రకాశ్‌కు సూచించింది. విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్, జస్టిస్‌ ఎన్‌ హరినాథ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

ప్రిన్సిపాళ్లుగా నాన్​ టీచింగ్​ సిబ్బందా ! - రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్​ - HC Serious on State Government

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఈ ఏడాది మార్చి 15న ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సంజీవరావు, మరికొందరు సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. ప్రిన్సిపల్‌ పోస్టుల పదోన్నతిలో జూనియర్‌ లెక్చరర్లు లైబ్రరీ సైన్స్‌ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం 2021లో ప్రభుత్వం జారీచేసిన జీవో 76కి విరుద్ధమన్నారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కె.శ్యామ్‌కుమార్‌ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం జీవో 76 విషయంలో కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని గత విచారణలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ హాజరై కోర్టుకు నేరుగా వివరణ ఇచ్చారు.

ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతి ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు

ప్రిన్సిపల్‌ ఆయా విద్యాసంస్థ పరిపాలన వ్యవహారాలు చూస్తారని జీవో 76 సరైనదేనని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ కోర్టుకు తెలిపారు. గతంలో జరిపిన నియామకాల గురించి వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ కేవలం పరిపాలన వ్యవహారాల కోసమే అయితే ఎంబీఏ డిగ్రీ పొందిన వారిని ప్రిన్సిపల్స్‌గా నియమించొచ్చని వ్యాఖ్యానించింది. 21వ శతాబ్ధంలో ఉన్నామని, రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో డిజిటల్‌ పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని ముఖ్యకార్యదర్శి బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలా అయితే టీచర్లందరినీ డిస్‌మిస్‌ చేసి ఏఐను వినియోగించొచ్చు కదా అని వ్యాఖ్యానించింది.

మన విద్యా బోధన సంప్రదాయ పద్దతిలో జరుగుతోందని గుర్తుచేసింది. ప్రవీణ్‌ప్రకాశ్‌ వాదనలు వినిపిస్తూ పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌లను వర్సిటీలలో ఉపకులపతులుగా నియమిస్తున్నారని, వారికి ఆయా బోధనాంశాలపై అవగాహన ఉండదన్నారు. ఏదో ఒక సబ్జెక్టులో నిష్ణాతులైన వారిని జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపల్‌గా నియమిస్తున్నారని తెలిపారు. ఈ విధానం డిగ్రీ కళాశాలల్లో కొనసాగుతోందని, దానిని జూనియర్‌ కళాశాలలకు వర్తింపచేస్తున్నామన్నారు. ప్రిన్సిపల్స్‌గా నియమితులైన పీడీ, లైబ్రేరియన్లకు శిక్షణ ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు.

ధర్మాసనం అందుకు స్పందిస్తూ ఒక వ్యక్తికి సమన్యాయం చేస్తున్నామన్న పేరుతో వేలమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, ఈ వ్యవహారంపైనే తమ అందోళన అంతా అని వ్యాఖ్యానించింది. బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్స్‌గా నియమిస్తే విద్యా ప్రమాణలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. దీంతో లైబ్రేరియన్లు, పీడీలకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించే విషయంలో లోతుగా పరిశీలిస్తామని ప్రవీణ్ ప్రకాశ్ కోర్టుకు నివేదించారు. సంబంధిత అధికారులతో చర్చించేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

Teachers Transfers Guidelines : ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు నూతన మార్గదర్శకాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details