AP High court on Traffic Rules Violation : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనేలా ప్రజలకు ఓ సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు పేర్కొంది. రహదారులపై తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని తెలిపింది. పోలీసులు రోడ్లపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వాళ్లు కూడా భయపడి వెనక్కి తగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని వ్యాఖ్యానించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి, భారీ సంఖ్యలో మరణిస్తున్నారంటూ న్యాయవాది తాండవ యోగేశ్ గతంలో ఏపీ హైకోర్టులో పిల్ వేశారు.
దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం, ట్రాఫిక్ ఐజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా, కోర్టు ముందు డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తు చేస్తూ పలు విషయాలను ఏపీ హైకోర్టు ప్రస్తావించింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా చలానాలు వేసే విధానాన్ని తగ్గించాలంటూ పోలీసులకు ఆదేశించింది. జరిమానా విధించిన సొమ్మును 90 రోజుల్లో చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది.
667 మంది చనిపోవడం చిన్నవిషయం కాదు :సెక్షన్-167 ప్రకారం నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సీజ్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సెక్షన్-206 ప్రకారం వారి లైసెన్స్ కూడా రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధరించని కారణంగా జూన్ నుంచి మూడు నెలల్లో 667 మంది చనిపోవడం చిన్నవిషయం కాదని విచారం వ్యక్తం చేసింది. హెల్మెట్‌ను తప్పనిసరి ధరించాలని జూన్‌లో తాము ఇచ్చిన ఆదేశాలు అమలుచేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కాదా అని పేర్కొంది. దాదాపు 90 శాతం మంది హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని వివరించింది. బైక్ నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్న వాళ్లు సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని స్పష్టం చేసింది.