AP High Court Fire on Machavaram Police :పోలీస్ స్టేషన్ల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను తమ ముందు ఉంచాలని ఆదేశించిన ప్రతి సారీ ఏదో ఒక సాకు చెప్పి అప్పగించడం లేదంటూ పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పోలీసులు తమాషాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది.
జనవరి 7కు వాయిదా :సీసీ టీవీ కాలిపోయిందంటూ పల్నాడు జిల్లా మాచవరం ఠాణా ఎస్హెచ్ఓ అఫిడవిట్ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఎస్హెచ్ఓను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని గుర్తు చేసింది. అవి సక్రమంగా పని చేయనప్పుడు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓ పైనే ఉంటుందని స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. వ్యాజ్యంపై విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.