High Court Supports Cases Against Objectionable Social Media Posts :సోషల్ మీడియా వేదికగా ఏమైనా చేయవచ్చు అనుకుంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. అసభ్య, అనుచిత, అభ్యంతరకర పోస్టుల పెడుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు, దుష్ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఎంత మాత్రం తగిన వేదిక కాదంది. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా అసభ్యకర పోస్టులు పెడుతూ ఏమైనా చేయవచ్చు అనుకునే వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేసింది.
కేసులు నమోదు చేస్తే తప్పేముంది :సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పని చేసిన పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసిన పిల్‌ను విచారించడానికి హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరఫున వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏజీగా పనిచేసిన ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన పౌరుల వాక్ స్వాతంత్య్రం హక్కును హరించేలా పోలీసు యంత్రాంగం విచ్చలవిడిగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తోందన్నారు.
అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడితే తప్పేంటి? : హైకోర్టు
స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితులు లేకుండా చేస్తున్నారని వాదించారు. వ్యక్తుల ప్రతిష్ఠను దిగజారుస్తుంటే కేసులు నమోదు చేస్తే తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. చట్ట ప్రకారం ముందుకు వెళుతున్నప్పుడు ప్రభుత్వాన్ని తాము ఏ విధంగా నిరోధించగలమని అడిగింది. కేసులు నమోదును క్వాష్ పిటిషన్ల ద్వారా ప్రశ్నించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఉండగా పిల్ వేయడం తగదని హితవుపలికింది.