AP High Court on 41A notice: విచారణ నిమిత్తం తమముందు హాజరుకావాలని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నిందితులకు పోలీసులు నోటీసులు జారీచేశాక ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణార్హత ఉండదని చెప్పడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హాజరు నిమిత్తం పోలీసులు నోటీసు జారీచేసినప్పటికీ, అరెస్టు గురించి ఆందోళన ఉన్నప్పుడు ముందస్తు బెయిలు పిటిషన్ విచారణార్హమేనని తేల్చిచెప్పింది. 41ఏ నోటీసు ఇచ్చినా అరెస్టు ఆందోళన ఎప్పుడూ ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్లను విచారించకుండా న్యాయస్థానాలు తోసిపుచ్చడానికి వీల్లేదని కర్నాటక హైకోర్టు ‘రామప్ప’ కేసులో తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.
ప్రస్తుత కేసులో నిందితుడికి 41ఏ నోటీసు ఇచ్చినా అరెస్టు ఆందోళన ఉన్న కారణంగా ముందస్తు బెయిలు పిటిషన్ విచారణార్హమైనదని పేర్కొంది. పోలీసులు పిటిషనర్‌కు 41ఏ నోటీసు జారీచేసిన నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాల్సిన అవసరం లేదని సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) చేసిన వాదనను తోసిపుచ్చింది. పిటిషనర్‌కు షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఇటీవల ఈమేరకు కీలక ఉత్తర్వులిచ్చారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దును కోరే హక్కు దస్తగిరికి ఉంది: హైకోర్టు - Viveka Murder Case
కొంతమంది ఫేస్‌బుక్ నకిలీ ఐడీలను సృష్టించి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటుగా ఆమె సోదరి సునీతను అపకీర్తిపాలు చేయడంతో పాటుగా, వారని దూషిస్తూ పోస్టులు పెట్టారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విశాఖపట్నానికి చెందిన పినపల ఉదయ్‌భూషణ్ ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం హాజరుకావాలని పిటిషనర్‌కు 41ఏ నోటీసు ఇచ్చామని ఏపీపీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు.
విశాఖపట్నంలో ఉన్న పిటిషనర్‌కు పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నా, వేధించాలన్న ఉద్దేశంతో పులివెందుల ఠాణాకు తీసుకెళ్లారన్నారు. అక్కడ నిర్బంధించారన్నారు. ఫిర్యాదుదారుడు వి.రవీంద్రరెడ్డి పిటిషనర్‌ను హతమారుస్తామని ఠాణాలో బెదిరించారన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ పులివెందుల ఠాణాకెళ్లి దర్యాప్తు అధికారిముందు హాజరు హాజరుకాలేరన్నారు. హాజరుకావాలని నోటీసు ఇచ్చినప్పటికీ, అరెస్టు గురించి ఆందోళన ఉందన్నారు. కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి, పిటిషనర్‌కు షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేశారు. పులివెందుల ఎస్‌హెచ్‌వో ముందు హాజరై పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. మూడు నెలలపాటు ప్రతి 15 రోజులకు ఓసారి కడప జిల్లా ఎస్పీ ముందు హాజరవ్వాలని స్పష్టంచేశారు.
ఇందూ- హౌసింగ్ బోర్డు కేసులో వైవీపై సృష్టమైన ఆధారాలున్నాయి : తెలంగాణ హైకోర్టు - MP YV SUBBAREDDY