AP GRADUATE MLC ELECTIONS 2024: ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నమోదుకు నవంబరు 6వ తేదీ వరకు గడువు ఉంది. అవసరమైన పత్రాలను ఆయా మండలాల్లోని తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, ceoandhra.nic.in వెబ్‌సైట్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి:
- 2021 సెప్టెంబరు నాటికి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులుగా ఈసీ తెలిపింది. అప్పట్లోగా డిగ్రీ పూర్తి చేసినవారు 2025లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవాలి.
- ఓటు నమోదుకు సంబంధించి రెండు జిల్లాలకు ఈఆర్వోగా (Electoral Registration Officer) గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారు. ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు ఏఈఆర్వోలుగా (Assistant Electoral Registration Officer), ఎంపీడీవోలు డిజిగ్నేటెడ్ అధికారులుగా, పోస్ట్ మాస్టర్లు, ప్రభుత్వ కాలేజీలు ప్రిన్సిపాళ్లు అదనపు డిజిగ్నేటెడ్ అధికారులుగా వ్యవహరిస్తారు.
- ఒకే కుటుంబంలో పదిమంది పట్టభద్రులుంటే వారందరి అప్లికేషన్లను సంబంధిత ఏఈఆర్వోకు ఇవ్వొచ్చు.
- ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నవారు పూర్తి చేసిన దరఖాస్తులను కంపెనీ ప్రతినిధి ద్వారా ఏఈఆర్వోకు అందివ్వొచ్చు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామా ప్రకారం ఆ ప్రాంతంలోని ఏఈఆర్వోకే ఇవ్వాలి.
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినవారు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కచ్చితంగా సెల్ఫ్, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తప్పనిసరి.
- దరఖాస్తులను సంబంధిత బీఎల్‌వోలు (Booth Level Officer) పరిశీలించి పేర్లను ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు చేపడతారు.