AP Govt Released Flood Compensation : వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థికసాయం అందించారు. వరద సాయం కింద బాధిత ప్రజలకు, పంట నష్టం కింద రైతులకు పరిహారం రూపంలో మొత్తం 602 కోట్లు అందించినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదలకు 47 మంది చనిపోయారని, ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందజేసినట్లు వెల్లడించారు. భారీ వర్షాలకు 1562 పశువులు చనిపోయాయని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 18 వేల 70 ఇళ్లు మునిగిపోగా, 215 కోట్లు పరిహారం ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. విజయవాడలో మొత్తం 78 వేల 558 నివాసాలు ముంపునకు గురవ్వగా, పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64 వేల 799 ఉన్నాయని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు 25 వేల చొప్పున సాయం మొత్తం 161.99 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. విజయవాడలో ఒకటి, ఆపై అంతస్తుల్లో 13వేల 759 ఇళ్లు ముంపుకు గురవ్వగా, వారికి 10 వేల చొప్పన 13.76 కోట్లు అందించామంది.
చనిపోయిన వారికి, పశు సంపదకు పరిహారం కింద 6.83 కోట్లు ఇవ్వగా, దెబ్బతిన్న 44 వేల 402 ద్విచక్రవాహనాలకు 3 వేల చొప్పున 13.32 కోట్లు పరిహారం ఇచ్చినట్లు తెలిపింది. దెబ్బతిన్న 4 వేల 348 ఆటోలకు 10 వేల చొప్పున 4.34 కోట్లు ఆర్థిక సాయం అందివ్వగా, 1243 తోపుడు బండ్లకు 20 వేలు చొప్పున 2.48 కోట్లు ఇచ్చామని పేర్కొంది. దెబ్బతిన్న 5 వేల 181 కిరాణా షాపులు, హోటల్స్‌కు 25 వేల చొప్పున 12.97 కోట్లు పరిహారం అందించామంది.
2500 చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతినగా, ఒక్కో పరిశ్రమకు 50 వేల చొప్పున 12.50 కోట్లు, 469 మధ్యస్థాయి పరిశ్రమలకు లక్ష చొప్పున 4.69 కోట్లు, 197 పెద్ద పరిశ్రమలకు 1.50 లక్షల చొప్పున 2.95 కోట్లు అందిచామంది. మొత్తం 8 వేల 347 పరిశ్రమలు దెబ్బతినగా, పరిహారం కింద 33.97 కోట్లు అందజేశామని వెల్లడించింది. మొత్తం లక్షా 12 వేల 345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలు దెబ్బతినగా, 278 కోట్లు పరిహారం అందించామంది. మొత్తం 9 వేల 236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం వాటిల్లగా 32.67 కోట్లు పరిహారం ఇచ్చినట్లు తెలిపింది.
రాష్ట్రంలో వరద బాధితులకు ఆర్థికసాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు - Flood Relief Package Increased AP
CM Chandrababu on Heavy Flood: బుడమేరుతో పాటు ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద ఎప్పుడూ రాలేదని, బ్యారేజికి 11.90 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద సామర్థ్యం ఉంటే 11.47 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కూడా విజయవాడ వరద ముంపునకు కారణం అయ్యిందని విమర్శించారు. సీఎంగా వరద ముంపు ప్రాంతాల్లో తిరిగినప్పుడు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, అందుకే ఎన్టీఆర్ కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి పరిస్థితి పర్యవేక్షించినట్లు వెల్లడించారు. మొట్టమొదటిగా సింగ్ నగర్ వెళ్లి పరిస్థితి పరిశీలించి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా అందరితో మాట్లాడి బోట్లు, హెలికాప్టర్లు తెప్పించామన్నారు.
సీఎం సహాయనిధికి 400 కోట్ల రూపాయలు: వరద ప్రాంతాల్లో 2.30 లక్షల అగ్గిపెట్టెలు, 3 లక్షల కొవ్వొత్తులు పంపిణీ చేశామని తెలిపారు. మొత్తం 1.14 కోట్ల నీటి బాటిళ్లు, 47 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చామని, 1.15 కోట్ల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. 780 పొక్లెయినర్లు పని చేశాయని, ఫైర్ ఇంజిన్లతో 75 వేల ఇళ్లను, 331 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రపరిచామని చెప్పారు. 20 వేల మెట్రిక్ టన్నుల చెత్త కూడా ముంపు ప్రాంతాల్లో తొలగించామన్నారు. ఇప్పటికీ 400 కోట్ల రూపాయల మేర సీఎం సహాయనిధికి డబ్బులు వచ్చాయని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. చిన్నా, పెద్ద ఇలా ప్రజలు అందరూ స్పందించారని, సంఘటితంగా ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
బాధితులకు ఇప్పటి వరకూ రూ. 602 కోట్లు విడుదల చేశామని, ఇందులో 400 కోట్లు దాతలే ఇచ్చారన్నారు. మొత్తం నష్టం 6 వేల 800 కోట్ల మేర జరిగిందని, కేంద్రం ఇచ్చే డిజాస్టర్ ఫండ్‌కు కూడా హద్దులు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ మానవత్వంతో వ్యవహరించాలని ఈ మొత్తం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. వర్షాల వల్ల మొత్తం 16 జిల్లాలు ప్రభావితం అయ్యాయని, మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. విజయవాడ 78 వేల 858 ఇళ్లు వరద ముంపు ఎదుర్కొన్నాయని చెప్పారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కిరాణా దుకాణాలు, తోపుడు బళ్లకు సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, ఉద్యాన పంటలకు సాయం అందిస్తున్నామన్నారు. ఇళ్లు మునిగిన వారికి 25 వేల రూపాయల చొప్పున, మొదటి అంతస్తులో ఉన్న వారికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని స్పష్టం చేశారు.