AP Govt Focus on FiberNet :ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌కు చౌకగా అందించే ఫైబర్‌నెట్ మళ్లీ ప్రజాదరణ చూరగొనేందుకు శక్తియుక్తులు కూడగడుతోంది. రూ.149 బేసిక్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోటిమందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యాచరణ అమల్లోకి తెచ్చేలా రంగం సిద్ధమవుతోంది. ఏపీలో ఇంటింటింకీ అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 2017లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్‌నెట్.
అప్పట్లో ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్లను సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందిస్తుండగా వాటికి నెలవారీ బిల్లు తడిసి మోపెడయ్యేది. మూడు రకాల సేవల్ని ఒకే కనెక్షన్‌గా ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించించింది నాటి టీడీపీ ప్రభుత్వం. కేవలం రూ.149కే బేసిక్ ప్లాన్ నిర్ణయించి, కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయడంతో వారే ఇంటింటికీ తిరిగి ఇళ్లకు ఫైబర్‌నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. 2019 మార్చి నాటికి 17 లక్షల కనెక్షన్లు ఇచ్చింది.
కోటికి పెంచడమే లక్ష్యం : వైఎస్సార్సీపీ హయాంలో ఫైబర్‌నెట్ పడకేసింది. ఐదేళ్లలో 17 లక్షల కనెక్షన్లు కాస్తా 5 లక్షలకు దిగజారాయి. సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది. గత ప్రభుత్వ నేతల అవినీతి అక్రమాలతో సంస్థను పీకల్లోతు అప్పుల్లో ముంచి ఫైబర్‌నెట్‌ను దివాలా అంచులకు నెట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫైబర్‌నెట్‌కు పూర్వవైభవం తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సంస్థ ఛైర్మన్ జీవీరెడ్డి కనెక్షన్ల సంఖ్యను కోటికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు.