AP Govt First Cabinet Meeting: ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు, వచ్చే 5 ఏళ్లలో అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. జూలై నెలాఖరుకల్లా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్‌లో చేర్చాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను ప్రజలకు తెలిపేలా శ్వేతపత్రాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై శాఖాధిపతులకు దిశానిర్దేశం చేయటంతో పాటు వచ్చే 100 రోజుల్లో అమలు చేయాల్సిన కార్యచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది.
వాటికి నేటి సమావేశంలో ఆమోదం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఇవాళ సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ మొత్తం 4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. వాటికి నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు.
దేవుడి స్క్రిప్ట్‌తోనే వైఎస్సార్సీపీ 11 సీట్లు- పిరికితనంతో జగన్ పారిపోయాడు: చంద్రబాబు - CM Chandrababu on YSRCP
మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు తెప్పిస్తున్న ప్రభుత్వం, వాటినీ మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వ హయంలో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణ, సంబంధిత బాధ్యులపై చర్యలకు మంత్రివర్గం ఉపసంఘాల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.
మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. వివిధ కార్పొరేషన్ల పునరుద్ధరణ వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రొత్సాహం, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్థి, ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలుకు, వివిధ కేసుల పరిష్కరానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యావిధానం, ఉచిత ఇసుక, మైనింగ్ వంటి కీలక అంశాల పై మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అసాంఘిక శక్తులకు చంద్రబాబు హెచ్చరిక- మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు - CM Serious on Crime Against Women