YSRCP Government Illegal Sand Mining :పాపఘ్ని, పెన్నా, కుందూ, చెయ్యేరుతో పాటు ఉపనదుల్లోనూ ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. సుప్రీంకోర్టు, ఎన్జీటీ హెచ్చరికలను పట్టించుకోకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. కాంట్రాక్టు సంస్థ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ 2021 మే నుంచి 2023 నవంబర్ వరకు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ప్రధాన గుత్తేదారుగా ఉంది.
Vigilance Investigation YSRCP Sand Irregularities : ఉపగుత్తేదారుగా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవహరించగా ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. ఇసుక దందా సాగించిన ముఠాల వెనుక అసలు ఉన్నది ఎవరు? అడ్డొచ్చిన వారిని, ప్రశ్నించినవారిని చంపడానికీ వెనకాడని బరితెగింపు ఎలా వచ్చింది? ఇసుక దోపిడీ ముఠాల్ని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఎందుకు ఊరుకుంది? వంటి ప్రశ్నలతో విజిలెన్స్ విచారణ కొనసాగింది.
వివరాలు రాబట్టిన విజిలెన్స్ : వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల ఇసుక గుత్తేదారు నారాయణరెడ్డి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నాయకుడు వైఎస్సార్సీపీలో ఉండగా ఇసుక దందాపై సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు చేశారు. అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇసుక దందాపై పోరాడుతూ మరింత మద్దతు కోసం టీడీపీలో చేరారు. ఈ నేతను సైతం విజిలెన్స్ కలిసి వివరాలు రాబట్టింది.