Inter Mid Day Meal Scheme in AP :ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. సర్కార్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి ప్రారంభం కానుంది.
దీని వల్ల 1,48,419 మంది విద్యార్థులకు భోజనం అందనుంది. విజయవాడ పాయకాపురం నుంచి మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 కాలేజీలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ వాటికి భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయనున్నారు.
నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ - మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ప్రదాత పేరు
అర్ధాకలితో విద్యార్థులు విద్యాభ్యాసం :మరోవైపుఏపీలో చాలా మంది విద్యార్థులురోజూ ఉదయం 8 గంటలకు బయల్దేరి చాలా దూరం ప్రయాణించి కాలేజీకి చేరుకుంటారు. కొన్నిసార్లు ఇంట్లో వీలు కుదరకపోవడం, వెంట తెచ్చుకున్న క్యారేజీ మధ్యాహ్నానికి పాడవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇలా ఒకటి, రెండు ప్రాంతాలు కాదు రాష్ట్రం మొత్తం మీద వివిధ జూనియర్ కళాశాలల్లో ఈ సమస్య ఉంది.