Eagle Task Force in AP :రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం 'ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్ )ను' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో అమరావతిలో నార్కోటిక్ పోలీస్‌స్టేషన్, 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఉన్నాయి.
గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ ఫోర్స్ కార్యాచరణ చేపట్టనుంది. ఇందులో పనిచేసే సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఇందులో చేరిన యూనిఫాం సర్వీసు ఉద్యోగులకు 30 శాతం ప్రత్యేక అలవెన్స్ ఇవ్వనున్నట్టు వివరించింది. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాల్లో విచారణకు 5 ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి హైకోర్టుకు నివేదించామని వెల్లడించింది. ఈగల్ ఫోర్స్‌కు ముందుగా రూ.8.59 కోట్లు కేటాయిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు.
డ్రగ్స్ నెట్వర్క్ని ధ్వంసం చేసేలా కార్యాచరణ : గంజాయి సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, సేవనం లాంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించేలా దీనికి ప్రత్యేకంగా బాధ్యతల్ని అప్పగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో మత్తు పదార్థాలు, సింథటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించింది. ఏపీలో ప్రజారోగ్యాన్ని కాపాడేలా మాదకద్రవ్యాల నెట్వర్క్ని ధ్వంసం చేసేలా కార్యాచరణ, దర్యాప్తు ఉండాలని ఈగల్కి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గతంలో సీఐడీ నార్కోటిక్స్ సెల్ ఆధీనంలో ఉన్న ఈ అధికారాలను వీటికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.