ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట - వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ పునఃపరిశీలన - AP GOVT FOCUS ON VMRDA MASTER PLAN

విశాఖ బృహత్తర ప్రణాళిక పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం - ప్రణాళికను వైఎస్సార్సీపీకి అనుకూలంగా చేశారన్న ఆరోపణలతో చర్యలు

VMRDA Master Plan Issue in AP
VMRDA Master Plan Issue in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 6:09 PM IST

VMRDA Master Plan Issue in AP : విశాఖ బృహత్తర ప్రణాళిక పునఃపరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఇందులో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. గతంలో వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికను వైఎస్సార్సీపీకి అనుకూలంగా చేశారన్న ఆరోపణలతో వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలు ప్రారంభించింది.

గత ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) రూపొందించిన బృహత్తర ప్రణాళిక-2041పై అనేక ఆరోపణలొచ్చాయి. సామాన్యుల అభ్యర్థనలను పట్టించుకోకుండా వైఎస్సార్సీపీలోని కొందరికి అనుకూలంగా మార్పులు, చేర్పులు జరిపి ఇష్టానుసారంగా చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ-పీజీఆర్ఎస్​లో తరచూ ఫిర్యాదులు వస్తుండడంపై మొత్తం మాస్టర్‌ ప్లాన్‌ను పునఃపరిశీలించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని వీఎంఆర్డీఏ కమిషనర్‌ని ఆదేశించింది. ముసాయిదా ప్రణాళికకు, తుదికాపీ మధ్య భారీ మార్పులు ఎందుకు చోటు చేసుకున్నాయి? ఎవరు ఇందుకు బాధ్యులో తేల్చాలని స్పష్టం చేసింది. వాటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఆ ప్రణాళికలో సవరించాల్సిన వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వీఎంఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Review on VMRDA Master Plan : విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 4,380 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి వీఎంఆర్డీఏ 2041-మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. ఇది 2021 నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. ప్లాన్ తయారీలో అప్పట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించగా 6 వేల అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో వైఎస్సార్సీపీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చి ప్రజల అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారన్న విమర్శలొచ్చాయి. మాస్టర్ ప్లాన్-2041ను గత ప్రభుత్వ నాయకుల భూముల విలువ పెంచుకునేలా మార్పులు చేశారన్న విమర్శలు ముందునుంచి ఉన్నాయి.

రోడ్లు ఎటువెళ్తాయో ముందే తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో భారీగా స్థలాలు కొనుగోలు చేశారు. భీమిలి-భోగాపురం 6 వరుసల రహదారికి ఇరువైపులా నేతలు కొనుగోలు చేసిన స్థలాలకు ఆనుకొని రోడ్డు వెళ్లేలా చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడ ఓ కీలక నేత కుటుంబ సభ్యుల కంపెనీ పేరుతో 87,000ల చదరపు గజాలు కొన్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డు విస్తరణలో పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులకు స్థలాలున్న వైపు పెంచకుండా మరోవైపు పెంచడం విమర్శలకు తావిచ్చింది.

బృహత్తర ప్రణాళికలో మార్పులు :గతంలో వుడా అనుమతించిన లేఅవుట్లలో కొన్న ప్లాట్లు మీదుగా చాలా రోడ్లు ప్రతిపాదించారు. భీమిలి, భోగాపురం, ఇతర మండలాల్లో వేల మంది కొనుగోలు చేసిన ప్లాట్లు నష్టపోయారు. ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన స్థలాలను గ్రీన్‌ బెల్ట్‌ కింద, మరికొన్ని ప్రభుత్వ స్థలాలు కింద మార్చేశారు. వీటన్నింటితోపాటు ప్రజా ప్రతినిధులు, సామాన్య జనం ఇచ్చిన అర్జీలు పరిగణలోకి తీసుకొని బృహత్తర ప్రణాళికలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2041 మాస్టర్​ ప్లాన్​ వీఎంఆర్డీఏది కాదు - విజయసాయి రెడ్డి స్కాం ప్లాన్​: మూర్తి యాదవ్​ - Murthy Criticize VMRDA Master Plan

YSRCP Leaders Changing VMRDA Master Plan: వారి వ్యాపారానికి అడ్డొస్తే దేనినైనా మార్చేస్తారు.. ఏకంగా మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు

ABOUT THE AUTHOR

...view details