Govt Provides Pension Transfer Facility to Beneficiaries:సామాజిక పింఛన్ల బదిలీ సౌకర్యంతో లబ్ధిదారులకు మేలు కలగనుంది. సాధారణంగా ప్రతినెలా పింఛను తీసుకునేందుకు దూరప్రాంతాల్లో ఉంటున్నవారు ఉరుకులు పరుగుల మీద తమ సొంతూళ్లకు వెళ్లి తీసుకుంటున్నారు. దీనికి రవాణా ఛార్జీల రూపంలో అధిక మొత్తంలో చేతిచమురు వదులుతోంది. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు పింఛను బదిలీ చేయించుకుంటే అక్కడే నగదు తీసుకునే వీలు కలగనుంది.
రాష్ట్రంలో పింఛన్లు తీసుకునే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చేవారి సంఖ్య ప్రతి సచివాలయం పరిధిలో 5 నుంచి 10 మంది వరకు ఉంటున్నారు. 3 నెలలకోసారి తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇతర ప్రాంతాల వారికి కొంత మేర ఉపశమనం కలిగింది. కాని ఇప్పుడు బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో వారికి మరింత లబ్ధి కలగనుంది.
ఇలా నమోదు చేసుకోండి:ఎన్టీఆర్ భరోసా పింఛను బదిలీ చేసుకోవాలనుకుంటే ముందుగా దగ్గర్లోని సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. పెన్షన్ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో చిరునామా ఇవ్వాలి. నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేరు నమోదు చేయాలి. ఈ విధానంతో పంపిణీ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.