ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో గనుల దోపిడీపై సీఐడీ దర్యాప్తు - క్వార్ట్జ్, సిలికాశాండ్‌ అక్రమాలపైనా విచారణ? - CID Inquiry on Illegal Mining - CID INQUIRY ON ILLEGAL MINING

Illegal Minerals Mining in AP : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్, సిలికాశాండ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన దోపిడీ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ సిద్ధం చేస్తోంది. లీజుదారులు విక్రయించే టన్ను సిలికాశాండ్‌ ధరను రూ.450 నుంచి రూ.1400లకు పెంచారు. కానీ రూ.700 మాత్రమే ఆన్‌లైన్‌లో స్వీకరించి, మిగిలిన రూ.700లు నగదుగా తీసుకున్నారు. ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నులు విక్రయించారు. ఇలా టన్నుకు రూ.700 చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరిందనేది సీఐడీ విచారణలో తేలుతుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

CID Inquiry on Illegal Mining
CID Inquiry on Illegal Mining (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 7:36 AM IST

Illegal Mining in AP : వైఎస్సార్సీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దందాపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో క్వార్ట్జ్, సిలికాశాండ్‌లో సాగిన దోపిడీపై కూడా సీఐడీ విచారణ చేయించనుంది. ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని క్వార్ట్జ్, సిలికాశాండ్‌ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం రాబట్టారు.

CID Inquiry on Illegal Mining : లీజులతోపాటు అవి లేనిచోట్ల, ప్రభుత్వ, పట్టా భూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించి కొలతలు వేశారు. ఆయాచోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కోట్లలో దోచుకున్నట్లు గుర్తించారు. దీనిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తే వైఎస్సార్సీపీ నేతల దోపిడీ లెక్క తేలుతుందని భావిస్తున్నారు. గనుల శాఖ నివేదిక సిద్ధం కాగానే క్వార్ట్జ్, సిలికాశాండ్‌ల్లో జరిగిన అక్రమాలపై వేర్వేరుగా సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసింది.

వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తిరుపతి జిల్లా కోట, చిల్లకూరు మండలాల్లోని సిలికాశాండ్‌ వ్యాపారాన్ని ఆ పార్టీకి చెందిన కీలక పెద్దలు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. చెన్నె మైనింగ్‌ వ్యాపారి బంధువులు వామన ఎంటర్‌ప్రైజెస్, వామన ఫ్యూచర్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గామా ఎంటర్‌ప్రైజెస్, వెంకటేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ అనే నాలుగు సంస్థల పేరిట మినరల్‌ డీలర్‌ లైసెన్సులు తీసుకున్నారు. లీజులను వారి ఆధీనంలోకి తీసుకొని వాటిలో సిలికాశాండ్‌ తవ్వి 4 ఎండీఎల్స్‌కు తరలించేవారు.

నగదుగా తీసుకున్న సొమ్ము ఏమైంది? : వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు లీజుదారులు విక్రయించే టన్ను సిలికాశాండ్‌ ధర రూ.450గా ఉంది. దాన్ని తొలుత రూ.800, తర్వాత రూ.1100, చివరకు రూ.1400 ఖరారు చేసి దాన్నే ఎన్నికల వరకు కొనసాగించారు. లీజుదారులకు టన్నుకు రూ.100 చొప్పున ఇచ్చి వారు నోరెత్తకుండా చేశారు. టన్ను రూ.1400లకు విక్రయించినా అందులో రూ.700 మాత్రమే ఆన్‌లైన్‌లో స్వీకరించి మిగిలిన రూ.700 నగదుగా తీసుకున్నారు.

Illegal Mining In YSRCP Government :అయితే లావాదేవీల్లో తేడా రావడం వల్ల 2022 చివర్లో వామన, దాని అనుబంధ సంస్థలు సిలికా వ్యాపారం చేయకూడదని వైఎస్సార్సీపీ కీలక నేతలు హుకుం జారీ చేశారు. ఆ తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులను రంగంలోకి దించి వ్యాపారం నడిపించారు. వీళ్లు కూడా టన్ను రూ.1400ల చొప్పునే విక్రయించారు. ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నులు అమ్మకం చేసినట్లు గుర్తించారు. టన్నుకు రూ.700 చొప్పున వసూలు చేసిన ఆ నగదు ఎక్కడికి చేరిందనేదే కీలకంగా మారింది. సీఐడీ విచారణలో ఈ గుట్టువీడే అవకాశముందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

6.21 లక్షల టన్నుల మేర తరలింపు :నెల్లూరు జిల్లాలో లభించే హైగ్రేడ్‌ క్వార్ట్జ్‌కు చైనాలో డిమాండ్‌ పెరగటంతో గత రెండేళ్లలో వైఎస్సార్సీపీ నేతలు భారీగా దోచుకున్నారు. గతంలో జిల్లా నుంచి ఏటా సగటున 1.50 లక్షల నుంచి 1.8 లక్షల టన్నుల క్వార్ట్జ్‌ తవ్వి తరలించేవారు. అనూహ్యంగా గతేడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల టన్నుల మేర తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వివిధ లీజుల నుంచి 3.2 లక్షల టన్నులు తరలించినట్లు పర్మిట్లు తీసుకున్నారు. ఎప్పుడో తవ్వకాలు నిలిచిపోయినవి, రెన్యువల్‌కు ఎదురుచూస్తున్న లీజులు ఇందులో ఉన్నాయి. వీటితో కలిపి 15 చోట్ల అక్రమంగా లక్ష టన్నులకుపైనే తరలించేశారు.

పర్మిట్ల డేటాతో విచారణ :ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ పట్టా భూముల్లో 14 చోట్ల నుంచి కూడా లక్ష టన్నులకుపైనే అక్రమంగా తవ్వేశారని నిర్ధారించారు. మరో లక్ష టన్నులకు ఇతర పర్మిట్లు తీసుకొని వాటితో నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్‌ను రవాణా చేశారని అధికారులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేతలు సిండికేటుగా ఏర్పడి టన్నుకు రూ.7000ల చొప్పున వసూలు చేశారు. చైనాకు కార్ట్జ్‌ ఎగుమతికి వినియోగించిన పర్మిట్ల డేటా ఉండటంతో సీఐడీ విచారణతో దందా మొత్తం వెలుగు చూస్తుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనివెనుక ఉన్నవాళ్లు కూడా బయటకొస్తారని అంటున్నాయి.

ముగ్గురాయి టెండరూ అస్మదీయులకే - డిమాండ్‌ ఉన్నా తక్కువ ధరకే

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా - కొండలే కాదు పొలాలూ కనుమరుగవుతున్నాయి

ABOUT THE AUTHOR

...view details