ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్- విధ్వంసం నుంచి వెలుగుల దిశగా కసరత్తు! - AP Govt on Visakha Development - AP GOVT ON VISAKHA DEVELOPMENT

AP Govt on Visakha Development : జగన్ ప్రభుత్వంలో విశాఖ తీవ్రస్థాయిలో దోపిడీకి గురైంది. తిరిగి ఆ గాయాల్ని మాన్పి మళ్లీ అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖ అభివృద్ధికి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్​కు రూపకల్పన చేసింది. ఇందుకోసం పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖుల కీలక భూమిక పోషించారు.

AP Govt on Visakha Development
AP Govt on Visakha Development (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 12:20 PM IST

Visakhapatnam City Development :వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ప్రభుత్వ పెద్దల చేతిలో తీవ్రమైన దోపిడీకి గురై, అభివృద్ధిలో రెండు దశాబ్దాలు విశాఖ వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ నగరాన్ని తూర్పు తీరానికి తలమానికంగా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఎన్డీయే సర్కార్ నడుం బిగించింది. సీఎం చంద్రబాబు సూచన మేరకు విశాఖ అభివృద్ధికి దార్శనికపత్రం (విజన్‌ డాక్యుమెంట్‌) సిద్ధమవుతోంది.

Visakha Tourism Development : ప్రకృతి సోయగాలకు నిలయమైన సుందర నగరం విశాఖ అభివృద్ధి 2014-19 మధ్య పరుగులు పెట్టింది. హుద్‌హుద్‌ వంటి పెను తుపాను తాకిడికి కకావికలమైంది. అయినా అప్పటి చంద్రబాబు సర్కార్ అకుంఠిత దీక్షతో పనిచేసి అనతికాలంలోనే సాధారణ స్థితికి తెచ్చింది. పలు ఐటీ కంపెనీలతో పాటు, మెడ్‌టెక్‌ సిటీని ఏర్పాటు చేసింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్, అదానీ డేటా సెంటర్, లులు వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పలు జాతీయ విద్యా సంస్థలు అక్కడ ఏర్పాటు చేశారు. అనేక కొత్త హోటళ్లు వచ్చాయి. ఆతిథ్య రంగం కళకళలాడింది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ వంటి భారీ ఈవెంట్లు, పెట్టుబడిదారుల సదస్సులు వంటి కార్యక్రమాలతో నిత్యం కోలాహలంగా ఉండేది.

జగన్‌ పాలనలో కుదేలై : అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతున్న విశాఖను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సడన్‌ బ్రేక్‌ పడింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెప్పింది. ఇలా ఐదు సంవత్సరాల్లో నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇటీవల వైజాగ్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు విమానాశ్రయం గ్రీన్‌రూమ్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో నగర అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా విజన్‌ డాక్యుమెంట్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఇటీవల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవ తీసుకొని విశాఖలోని పారిశ్రామిక, వ్యాపార ప్రముఖులతో భేటీ అయ్యారు. ఫ్యాప్సీ, ఏపీ ఛాంబర్స్, ద వైజాగపట్నం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఫ్యాప్సీ అధ్యక్షుడు కంకటాల మల్లిక్‌ సారథ్యంలో జరిగిన సమావేశంలో విజన్‌ డాక్యుమెంట్‌పై విస్తృతంగా చర్చించారు. సుదర్శన్‌ స్వామి (వీసీసీఐ), వంశీ (థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌), పీఎస్‌ఆర్‌ రాజు (ఫెర్రో అల్లాయ్స్‌), జి.రాజేష్‌ (సీఐఐ), శ్రీనాథ్‌ చిట్టూరి (ఏపీ ఛాంబర్‌), రాజా శ్రీనివాస్‌ (క్రెడాయ్‌), రాఘవేంద్రరావు (దసపల్లా హోటల్స్‌), సత్యనారాయణ (కోరమండల్‌ పెయింట్స్‌), మురళీకృష్ణ (సీఐఐ), పవన్‌ కుమార్‌ (సీఫుడ్‌ అసోసియేషన్‌), కేఆర్‌బీ ప్రకాశ్‌ (ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), కృష్ణ బాలాజీ (ఎంఎస్‌ఎంబీ), ప్రభు కిశోర్‌ (వరుణ్‌ గ్రూప్‌), రవి గోడే, మోనిష్‌ రాయ్, రామ్‌ప్రసాద్‌ కంచర్ల, హకీమ్‌ మెహదీ, శేషమురళీకృష్ణ, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొని సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సూచనలు, సలహాల్ని క్రోడీకరించి ఇవాళ విశాఖ పర్యటనకు వస్తున్న మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కి విజన్‌ డాక్యుమెంట్‌ను అందజేయనున్నారు.

సమావేశంలో చర్చకొచ్చిన కీలకాంశాలు :

రహదారుల విస్తరణ అత్యవసరం :

  • విశాఖపట్నంలో పెరుగుతున్న రద్దీకి, ట్రాఫిక్‌ అవసరాలకు తగ్గట్టుగా రహదారులు లేవు. ప్రయాణికులతోపాటు, పోర్టులకు సరకు రవాణా సులభంగా సాగేలా వాటిని విస్తరించాలి.
  • షీలానగర్‌ నుంచి అగనంపూడి వరకు రహదారి అత్యంత రద్దీగా మారిపోయింది. అదనపు వరుస గానీ, ఎలివేటెడ్‌ కారిడార్‌ గానీ నిర్మించాలి. షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకు పోర్టుతో మెరుగైన రోడ్డు అనుసంధానం కావాలి. భోగాపురం విమానాశ్రయంతోనూ మెరుగైన కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి.
  • భీమిలి లేదా భోగాపురంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఏపీ సర్కార్ 25 ఎకరాలు కేటాయించాలి. అక్కడ వివిధ క్రీడా సదుపాయాలతోపాటు, ఆయుర్వేద హెల్త్‌ రిసార్ట్‌ను అభివృద్ధి చేయాలి.

కంటెయినర్ హబ్​గా విశాఖ :

  • విశాఖపట్నంను కంటెయినర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలి. వైజాగ్ కంటే కొద్దిగా పెద్దదైన సింగపూర్‌ ఆగ్నేయాసియా, అమెరికాలకు ప్రధాన కంటెయినర్‌ హబ్‌గా ఎదిగింది.
  • విశాఖను చలనచిత్ర రంగానికి కేంద్రంగా అభివృద్ధి చేయాలి. సినిమా స్టూడియోల నిర్మాణానికి నగరంలో భూములు కేటాయించాలి.

పరిశ్రమలకు అందుబాటు ధరలో భూములు :

  • విశాఖ ప్రాంతంలో ఎకరం కనీసం రూ.2 కోట్లు పలుకుతుంది. భూమికే అంత భారీ మొత్తం వెచ్చించి, పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం కష్టం. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి తక్కువ ధరకు భూములు లభించేలా ఏపీ సర్కార్ చొరవ తీసుకోవాలి.
  • కేంద్రం సెజ్‌లతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే భూముల లీజు ధరలు ఎక్కువగా ఉన్నాయి. 33 సంవత్సరాల లీజు సొమ్ము ముందే చెల్లించాలన్న నిబంధన అడ్డంకిగా మారింది.
  • కంపెనీలకు ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధించిన కొన్ని జీఓల్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించలేదు. ఫలితంగా 50 వరకు కంపెనీలు మూతపడ్డాయి. తద్వారా 40,000 మంది ఉపాధి కోల్పోయారు. వాటిని తెరిపించేందుకు సర్కార్ చొరవ తీసుకోవాలి.

ట్రాఫిక్ నివారణకు మాస్టర్ ప్లాన్ :

  • విశాఖ నగరంలో ట్రాఫిక్‌ వేగంగా పెరుగుతోంది. అందుకు ఇప్పుడున్న మౌలిక వసతులు సరిపోవు. ఇందుకోసం సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ అవసరం.
  • నిర్మాణ రంగంలో వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు తెచ్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ అనుమతులన్నింటికీ సింగిల్‌ విండో విధానం ప్రవేశపెట్టాలి. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపుల్ని కేంద్రీకృతం చేయాలి.

కాలుష్య నివారణకు ప్రత్యేక కమిటీ :

  • విశాఖలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగువ్వాలంటే కాలుష్యానికి అడ్డుకట్ట పడాలి. దానికి ప్రత్యేక మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. నగర పరిశుభ్రత, పచ్చదనం పెంపు, జల కాలుష్యాన్ని నివారించడం, పారిశ్రామిక, ఇతర వ్యర్థాల్ని నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
  • విశాఖను ఫైనాన్షియల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఆర్‌బీఐ బ్రాంచ్‌ ఏర్పాటు చేయాలి. నగరంలో గిఫ్ట్‌ సిటీని ఏర్పాటు చేయాలి. దేశీయ బీమా కంపెనీల్నివైజాగ్​కి రప్పించేందుకు కృషి చేయాలి.
  • ఇప్పుడున్న ఐటీ కంపెనీల సమస్యల పరిష్కారానికి సింగిల్‌ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

2040 నాటికి తీరంలో ఐదు శాతం భూభాగం కోల్పోనున్న విశాఖ - నిపుణుల అంచనా - Visakhapatnam Coastal Area Loss

పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO

ABOUT THE AUTHOR

...view details