AP Govt on Tirumala Dams : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడు భక్తుల అవసరాలకు సరిపడా నీరు అందించడం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న జలాశయాలను జలవనరుల శాఖ పరిధిలోకి తేవడంతో పాటు నిల్వ సామర్థ్యం పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
Water Facilities in Tirumala :జలవనరుల శాఖ అధికారులు తిరుమలలోని జలాశయాలను పరిశీలించింది. వాటి తాజా స్థితిగతులు, భద్రతపై నివేదికను సిద్ధం చేశారు. జలాశయాల నిర్వహణకు తిరుమలలో రెండు సబ్ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే కేంద్ర జలసంఘానికి చెందిన డ్యాం భద్రతా విభాగం జలాశయాలను సందర్శించి భద్రతపై నివేదిక సమర్పించింది.
తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం ప్రస్తుతం రోజూ సగటున లక్ష మంది భక్తులు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య లక్షా పాతికవేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో తిరుమలలో ఇప్పుడున్న 5 జలాశయాల నీటి నిల్వలు భక్తుల అవసరాలు తీర్చడం సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి అవసరాలు తీర్చేందుకూ వీలుగా జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు.