Government Accepts Fibernet Chairman GV Reddy Resignation : ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు ఫైబర్ నెట్లో వివాదంపై నివేదిక సీఎం వద్దకు చేరింది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దినేష్ కుమార్ను జీఎడీకీ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు చర్యల ద్వారా అటు పార్టీలో అయినా, ఇటు ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం అనే నిర్థిష్ట అభిప్రాయాన్ని ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేసినట్లు అయ్యింది.
న్యాయవాద వృత్తిలో కొనసాగుతా : ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తనపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, కీలక బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నట్లు లేఖలో జీవీ రెడ్డి చెప్పారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని లేఖలో పేర్కొన్నారు.