ACB Inquiry on Venkata Reddy : గనుల శాఖలో అక్రమాల పుట్టగా మారిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. గనులు, ఇసుక అక్రమాల వ్యవహారంలో ఆయణ్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో ఆయన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ డీజీని ఆదేశిస్తూ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ గురువారం మెమో జారీ చేశారు. ఇసుక అక్రమాలపై గనుల శాఖ ఇచ్చిన నివేదికను డీజీకి పంపించారు.
EX Mines Director Venkata Reddy Suspend :ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సిలికా శాండ్, క్వార్ట్జ్ దోచుకోవడం వెనుక వెంకటరెడ్డి హస్తముందన్న ఆరోపణలతో ఆయనపై మరిన్ని కేసులు పెట్టనున్నట్లు సమాచారం. ఏపీఎండీసీలో బొగ్గు, మంగంపేటలో ముగ్గురాయి, నెల్లూరులో బీచ్‌శాండ్ టెండర్లలో అవకతవకలపై సమగ్ర నివేదిక సిద్ధమయ్యాక వేర్వేరు కేసులు పెట్టొచ్చని తెలుస్తోంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్లో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో చేరారు. ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్‌గా, కొన్నాళ్లకు ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం రాగానే జూన్ 7న వెంకటరెడ్డిని ఆ రెండు పోస్టుల నుంచి తొలగించింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
Mines Venkata Reddy Irregularities : జులై 31న వెంకటరెడ్డి డిప్యుటేషన్ గడువు ముగిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలపై ఏపీ సర్కార్ బుధవారమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. అనేక రీచ్లలో అక్రమాలు, ఉల్లంఘనలు నిజమేనని గనుల శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను అఫిడవిట్‌కు జత చేసింది. ఇదే సమయంలో వెంకటరెడ్డి మాతృశాఖ అయిన దిల్లీలోని కోస్ట్‌గార్డ్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్‌కు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ లేఖ రాశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయణ్ని సస్పెండ్ చేసినట్లు అందులో వెల్లడించారు.
ఇంతకీ వెంకటరెడ్డి ఎక్కడ? :వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల కాపీని ఆయనికి అందజేయాల్సిందిగా గనుల శాఖ సంచాలకుడికి సూచించగా, అతని ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. విజయవాడ కేసీపీ కాలనీలోని ఏపీఎండీసీ అతిథిగృహంలో మూడున్నరేళ్ల పాటు కుటుంబంతో వెంకటరెడ్డి నివాసం ఉన్నారు. జులైలో దాన్ని ఖాళీచేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫోన్ నంబర్ మార్చేశారని తెలిసింది.
ఏపీఎండీసీకి చెందిన అటెండర్ రాజు వెంకటరెడ్డి ఇంట్లో మూడున్నరేళ్లు పనిచేశారు. ఆయన ఇల్లు ఖాళీ చేసినప్పుడు సామాన్లన్నీ ప్యాక్ చేసింది రాజేనని ఏపీఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగా ఏ శాఖలోనూ, ఎవరినీ బదిలీ చేయొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా రాజును వెంకటరెడ్డి జూన్ 6న అన్నమయ్య జిల్లా మంగంపేట ముగ్గురాయి ప్రాజెక్టుకు బదిలీ చేశారు. మరునాడే సర్కార్ ఆయణ్ని అన్ని పదవుల్లోంచి తొలగించింది.