RTPP Staff Transfer in YSR District : వైఎస్సార్జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ఫ్లయాష్ వివాదం నేపథ్యంలో ముగ్గురు అధికారులపై ఏపీ జెన్ కో అధికారులు బదిలీ వేటు వేశారు. బూడిద తరలింపు వ్యవహారం జమ్మలమడుగు, తాడిపత్రి కూటమి నేతల మధ్య వివాదం నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బూడిద తరలింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులను ఏపీ జెన్ కో అధికారులు బదిలీ చేశారు.
లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవ్వరినీ ఉపేక్షించను - 'బూడిద' గొడవపై చంద్రబాబు అసహనం
వివరాల్లోకి వెళ్తే :ఆర్టీపీపీ కోల్ ప్లాంట్ ఏడీ చంద్ర ఓబుల్ రెడ్డి, ఫ్లైయాష్ ఏడీ నందా నాయక్, మరో ఏడీ శ్రీనివాసులను బదిలీ చేస్తూ ఏపీ జెన్ కో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరి ముగ్గురిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని లేఖలో పేర్కొన్నారు. బూడిద తరలింపులో సైతం ఆర్టీపీపీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు కావాల్సిన సిమెంటు కర్మాగారాలను స్థానికులకు కాంట్రాక్టు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీపీపీ నుంచి లారీల్లో బూడిద ఓవర్ టన్నేజ్ తరలిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగానే ఇద్దరి కూటమి నేతల మధ్య వివాదం రేగుతున్నా పట్టించుకోలేదని జెన్ కో అధికారులు తీవ్రంగా పరిగణించారు.