AP FiberNet Scam Updates : జగన్ అండతో ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ హోదాలో మధుసూదన్‌రెడ్డి సొంత జాగీరులా సంస్థ ఆదాయానికి లెక్కాపత్రం లేకుండా పంచిపెట్టారు. సంస్థ అవసరానికి మించి నియామకాలు చేయడమే కాకుండా, బంధువులకు కీలక పోస్టులు, కాంట్రాక్టులు ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు, సంస్థ పేరిట తెచ్చిన అప్పును లెక్కాపత్రం లేకుండా పంచిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
EX MD Madhusudhan Reddy Scams in FiberNet :ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫైబర్‌నెట్‌లో జరిగిన ఆక్రమాలకు ఆధారాలు దొరకకుండా చేసేందుకు కొందరు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సర్కార్ గత నెల 4నుంచి విజయవాడలోని ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిబ్బంది ఆన్‌లైన్ విధానంలో పనిచేసేలా నిర్ణయం తీసుకుంది.
అంతా ముందస్తు వ్యూహమే : ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏపీ ఫైబర్‌నెట్ రూ.900 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ మొత్తం సంస్థ ఖాతాలో జమ కాగానే ఎడా పెడా చెల్లింపులు జరిగాయి. ఇందులో రూ.151 కోట్ల చెల్లింపులకు లెక్కాపత్రం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైబర్‌నెట్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలను ఇటీవల ఉన్నతాధికారులు పరిశీలించారు. కొన్ని చెల్లింపులకు ఎలాంటి వివరాలు లేవు. అయితే బ్యాంకు ఖాతాల సమాచారం ఆధారంగా లెక్క తేల్చడం అధికారులకు సాధ్యం పడడం లేదు.
నిశితంగా పరిశీలించాలని భావిస్తున్న అధికారులు :మధుసూదన్‌రెడ్డి వాటి దస్త్రాలు ఆన్‌లైన్‌లో లేకుండా చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ-ఆఫీసు విధానాన్ని తొలగించారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీన్నిబట్టి ముందస్తు వ్యూహంతోనే ఆన్‌లైన్‌లో రికార్డులు దొరక్కుండా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ప్రధాన కార్యాలయం తెరిచాకే, బ్యాంకు ద్వారా చెల్లించిన వందల కోట్లకు ఏ దస్త్రాలు ఉన్నాయి? అందులో ఉన్న లెక్కలేంటి? ఎక్కడి నుంచి ఎంత డబ్బు వచ్చింది? ఆ మొత్తాన్ని ఎవరెవరికి చెల్లించారు? వారికి వాస్తవంగా చెల్లించాల్సిన అవసరం ఉందా? వంటి అంశాలు తేలే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.