Nominations Scrutiny :రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామపత్రాల పరిశీలన జరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరైన వివరాలు లేనందున డోన్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ ఆమోదంపై చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి అధికారులు ఆమోదించడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి పెండింగ్‌లో ఉంచారు. ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు కుమారుడి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
కొడాలి నాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం - పెండింగ్‌లో బుగ్గన నామినేషన్
అనకాపల్లి జిల్లా పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్ నామినేషన్‌ను అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసులను ప్రస్తావించలేదని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు ఫిర్యాదు చేయగా. కేసుల వివరాలు పొందుపర్చలేదని అధికారులు గుర్తించారు. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని అదీప్‌రాజ్‌కు రిటర్నింగ్ అధికారి సమయమిచ్చారు.
బుగ్గనకు ఆర్వో అనుకూలంగా వ్యవహరించారు :నంద్యాల జిల్లా డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అఫిడవిట్‌పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం తెలిపారు. అఫిడవిట్ లో అన్ని ఆస్తుల వివరాలు చూపించలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారి బుగ్గన నామినేషన్‌ను పెండింగ్ ఉంచారు. అయితే సాయంత్రంలోగా అధికారులు నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. బుగ్గనకు ఆర్వో అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అఫిడవిట్ పై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. దీంతో మెుదట కిషోర్ రెడ్డి నామినేషన్‌ను ఆపిన అధికారులు తరువాత ఆమోదించారు.