AP Elections Counting Arrangements: దేశమే నివ్వెరపోయేలా, ప్రజాస్వామ్యమే తల దించుకునేలా ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఎవరు అవునన్నా కాదన్నా విధ్వంసంతో వైఎస్సార్సీపీ ఎన్నికల సందర్భంగా తన రౌడీ రూపాన్ని మొత్తం ప్రదర్శించింది. ప్రతిపక్షాలపై దాడులు, ఓటర్లను మద్యం, డబ్బుతో ప్రలోభాలు ఇలా ఎన్నికలు ఎలా జరగకూడదని ఈసీ నిబంధనలు ఉంటాయో అన్నింటిని అతిక్రమించి వైఎస్సార్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని తెలిసి, తిరిగి అధికారంలోకి రావాలన్న కుటిల ప్రయత్నంతో ఇష్టారీతినా అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ రోజు విధ్వంసంతో ప్రజలను భయాందోళనకు గురి చేశారు. అనంతరం కూడా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న హల్‌చల్ చూస్తుంటే, అసలు కౌంటింగ్ అయినా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా అనే సందేహం తలెత్తుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 82.37శాతం పోలింగ్ నమోదు అయింది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోస్టల్ బ్యాలట్ కలిపి పోలింగ్ నమోదైంది. ఆ లెక్కన గత ఎన్నికలతో పోలిస్తే 2.57% మేర అధికంగా ఓటింగ్ జరిగింది. దీనికి కారణం ప్రజలు ప్రభుత్వంపై ఉన్న అసహానాన్ని ఈ ఎన్నికల్లో ఓటు రూపంలో చూపించారు. అందుకు ఈ లెక్కలే ప్రధాన నిదర్శనం. ఇది చూసిన వైఎస్సార్సీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది.
ఈసారి తమ స్థానాలు గల్లంతే ఇక అని ఓ అంచనాకు వచ్చారు. ఇక చేసేదేమీ లేక ఓట్ల తర్వాత తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై దాడులకు దిగారు. ఎంతలా అంటే దేశం మెుత్తం ఒక్కసారిగా ఏపీలో అసలేం జరుగుతోందని చూశారు. అంతలా భయందోళనలు సృష్టించారు వైఎస్సార్సీపీ నాయకులు. మరి, ఎన్నికలు ముగిశాయి. ఎన్ని అక్రమాలు చేయాలో అంతా చేశారు. అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. దాడులకు తెగబడి రావణకాష్టాన్ని రగిలించారు.
అందరి దృష్టి కౌంటింగ్ పైనే, EVMఓట్లను ఎలా లెక్కిస్తారు- రౌండ్స్ లెక్కేంటి? - Election Counting
ఏం చేయాలో తెలియక: రాష్ట్రంలో పోలింగ్ రోజు, తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసను ప్రజలు మరిచిపోరు. ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపైనా ఆ ప్రభావం ఉంటుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఒకప్పుడు నేతలకు కొమ్ముకాసి వచ్చిన అధికారులు ఇప్పుడు వారి ఒత్తిళ్లు తట్టుకోలేక మమ్మల్ని మెడికల్ లీవ్ ఇప్పించండి, మేం వెళ్లిపోతాం అని ఈసీని బతిమిలాడుకుంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పనిచేసే సుమారు 15 మంది ఆర్వోలు తమకు గంటొక యుగంలా గడుస్తోందంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం తల పట్టుకుంటోంది.
ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వారు చెబుతుండటంతో పరిష్కారం ఏమిటనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది. ఒకప్పుడు బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు చూశాం. కానీ, ఆ రాష్ట్రాలను మించిపోయిన మన రాష్ట్రం. కనీసం ఫలితాలను కూడా ప్రశాంత వాతావరణంలో ప్రకటించే స్వేచ్ఛను కోల్పోయింది. దీనంతంటికి వైఎస్సార్సీపీ అరాచక మూకలు చేసిన, చేస్తున్న పనులే ముమ్మాటికీ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఏ ఎన్నికల్లోనూ చూడని వైనం ఇప్పుడు చూస్తామని ఇంతకన్నా సిగ్గమాలిన చర్య మరొకటి లేదని అంటున్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు - పలు జిల్లాల్లో 144 సెక్షన్ - Arrangements for Vote Counting
మాకొద్దు మహాప్రభో ఈ డ్యూటీ: అధికారులకే ఫలితాల వరకు రక్షణ లేనప్పుడు, ఒక వేళ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఓడితే ఆ రాక్షస మూక చేసే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఎంతో భయానకంగా ఉంటుందని చాలామంది ప్రజలు భయపడుతున్నారు. కనీసం మనిషి ప్రాణాలంటే లెక్కలేని ఆ కిరాయి సైన్యం ఎన్నికల ఫలితాలప్పుడు ఎలా ఖాళీగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఇక్కడ ఈసీ గురించి పోలీసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అసలు, రక్షణ కల్పించాల్సిన ఖాకీలు అధికార పార్టీతో అంటకాగి పరిస్థితి ఇంతవరకు దిగజార్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కనీసం ఇంటెలిజెన్స్ సాయం తీసుకుని అరికట్టాల్సిన దాడులను కూడా ఈసీ, పోలీసులు నివారించలేకపోవడం ఎంత పెద్ద భద్రతా వైఫల్యామో చెప్పవచ్చు. ఈవీఎం ధ్వంసమైన విషయం బయటికి రానివ్వలేదంటే ఎంతపెద్ద స్థాయిలో వైఎస్సార్సీపీ నాయకులు అధికారులను మభ్య పెట్టారో అర్థమవుతోంది. అదే పరిస్థితి ఎన్నికల కౌంటింగ్ రోజునా, ఫలితాల తర్వాత కూడా ప్రదర్శించాలని వైఎస్సార్సీపీ మూకలు సిద్ధం అయ్యాయి. అందుకే అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. వారి చెప్పిన పనులు చేయలేక ఒక్కొక్కరిగా బయటపడుతూ మాకొద్దు మహాప్రభో ఈ డ్యూటీ అని అంటున్నారు.
కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు - కొరడా ఝుళిపిస్తామంటూ హెచ్చరికలు - counting centers
ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నారు: ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల నియమాకం నుంచి టేబుళ్ల ఏర్పాట్లు సహా వివిధ అంశాలపై తాము చెప్పినట్లు వినాలంటూ కొందరు వైఎస్సార్సీపీ అభ్యర్థులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్నిచోట్ల వారు చెబుతున్నట్లే ఆర్‌ఓలు వింటున్నా మరికొందరు వ్యతిరేకిస్తున్నా రు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులున్నాయి. అందుకే దీంతో ఆర్‌ఓలు తమను తప్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నారు.