AP EAPCET Result Delay :ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్ధులకు నిరీక్షణ తప్పడం లేదు. మరింత జాప్యం చేస్తే చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.
AP EAPCET students bothering about results :ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి రాజీనామాకు యత్నించినా కుదరకపోవడంతో మెడికల్ లీవ్‌లో వెళ్లారు. ఇన్ఛార్జ్ ఛైర్మన్ బాధ్యతలను వైస్ ఛైర్మన్ రామమోహన్రావుకు అప్పగించారు. ఈఏపీసెట్ ఫలితాలు విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశ పరీక్ష పూర్తయి, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. కానీ ఫలితాల విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు.
AP Higher Education Council Chairman :ఛైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జ్ ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. సెమిస్టర్ లేట్ అయితే పాఠ్యాంశాలు హడావుడిగా నేర్చుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఈఏపీసెట్-2024 ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఇంజనీరింగ్ విభాగానికి 2 లక్షల 58 వేల 373 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 80వేల 706 మంది పరీక్ష రాశారు. ఇప్పుడు ఇంత మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచుస్తున్నారు. ఫలితాలు ఆలస్యమమ్యే కొద్దీ సిలబస్ పూర్తి చేయడం కూడా కష్టంగా మారుతుందని అధ్యాపకులు సైతం వాపోతున్నారు.