AP Cabinet Meeting key Decisions :రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 3 గంటలు పాటు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి అకౌంట్లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒక్కో ఉచిత సిలిండర్‌కు 900 కోట్లు చొప్పున 3 సిలిండర్లకు 2,684 కోట్లు భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్షలాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం :రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నా మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఏడాదికి 2,684 కోట్ల ఖర్చుతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నేడు నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి పండుగ నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్షలాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి కానుకగా అందిస్తుందన్నారు.
"మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అక్టోబర్ 31న ప్రారంభిస్తాం. అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాం. గ్యాస్ డబ్బులు చెల్లిస్తే 48 గంటల్లో డీబీటీ ద్వారా తిరిగి నగదు జమ అవుతుంది." - మంత్రి నాదెండ్ల మనోహర్
ఉచిత ఇసుకకు మంత్రివర్గం ఆమోదం : ఉచిత ఇసుక విధానంలో సినరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీతో సంబంధం లేకుండా ఒక్క సినరేజ్ చార్జీల వల్లే ప్రభుత్వంపై 264 కోట్లు భారం పడనుంది. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు ఆ నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో వ్యాఖ్యానించారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు.