AP Cabinet Meeting : ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని ఆయన మంత్రులకు తేల్చి చెప్పారు. ఇసుకలో ఎమ్మెల్యేల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులు తేల్చేందుకే ఈ నెల 18న టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్పై కూడా సీఎం, మంత్రులతో చర్చించారు. రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయ్ షీట్స్ తెరిస్తే బాగుంటుందని పలువురు అమాత్యులు ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు.
ఈ క్రమంలోనే వచ్చే 10 రోజుల్లో ఉచిత ఇసుక విధానంలో మార్పు రాకుంటే ఉపేక్షించనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకాలన్నారు. అన్ని బంధనాలు తొలగించి రవాణా, తవ్వకం ఛార్జీలు కూడా వీలైనంత తక్కువ ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉచిత ఇసుక అందించి తీరాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
AP Cabinet Decisions : రవాణా ఛార్జీలు తప్ప లబ్ధిదారులకు మరెలాంటి ఛార్జీలు పడకూడదని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎవరైనా వచ్చి వారే ఇసుక తవ్వుకుని తీసుకెళ్తామంటే ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని వెల్లడించారు. ఇసుక అక్రమాలు జరగకుండా ఇంఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మూడు నెలలు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని ఇకపై అలా ఉండకూడదని తేల్చిచెప్పారు. ట్రాక్టర్ మీద వెళ్లినా, పక్క ఊరు నుంచి ఇసుక తెస్తున్నా ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిబంధనలు ఎవరు పెట్టారని ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.