Eagle Force to Control Marijuana and Drugs in AP : రాష్ట్రానికి పట్టిన మత్తుని వదిలించేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈగల్ కదన రంగంలోకి దిగింది. గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ విధి విధానాలపై హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంజాయి, డ్రగ్స్ సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, కొనుగోలు, విక్రయం, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పని చేయనున్నట్లు వెల్లడించింది. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్, జిల్లాకో విభాగం, ఐదు చోట్ల ప్రత్యేక కోర్టులు ఉంటాయని తెలిపింది.
ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ : రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యరంగంలోకి వచ్చేసింది. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీసు స్టేషన్, జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో గతంలో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ హోదాల్లో పని చేసిన ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగానికి అధిపతిగా వ్యవహరించనున్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు :అమరావతిలో రెండు, విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో రెండు కలిపి మొత్తం నాలుగు రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉంటాయి. అమరావతిలో ఏర్పాటు చేసే నార్కోటిక్స్ పోలీసు స్టేషన్‌కు రాష్ట్రమంతటా పరిధి కల్పించారు. ఇక్కడి సిబ్బంది ఏపీలో ఎక్కడ అయిన సరే డ్రగ్స్, గంజాయి సంబంధిత కేసుల నమోదు, దర్యాప్తు చేయొచ్చు. డీఎస్పీ స్థాయి అధికారి ఈ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా వ్యవహరిస్తారు. ఈ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేయించి, నిందితులకు శిక్షలు పడేలా చూసేందుకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ - 1972 :డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ - 1972 ను ఏర్పాటు చేశారు. అమరావతి ప్రధాన కేంద్రంలోని కాల్‌సెంటర్ 24 గంటలూ పని చేస్తుంది. ఈగల్, నార్కోటిక్స్ పోలీసు స్టేషన్, జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాల్లో కలిపి మొత్తం 459 మంది సిబ్బంది పని చేస్తారు. 249 మందిని ప్రధాన కార్యాలయానికి, 66 మందిని నార్కోటిక్స్ స్టేషన్‌కు, 114 మందిని జిల్లా విభాగాలకు కేటాయించారు. వీరందరినీ పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకుంటారు. అనంతరం వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ విభాగంలో పని చేసే వారికి 30 శాతం అదనంగా అలవెన్స్ ఇవ్వనున్నారు.
ఈగల్‌ను మొత్తం ఆరు విభాగాల సమాహారంగా సిద్ధం
1.ఒకటోది లీగల్ విభాగం ఈగల్ సొంతంగా కేసులు నమోదు, దర్యాప్తు చేయడంతో పాటు ఇతర పోలీసుస్టేషన్‌లలో నమోదైన కేసుల దర్యాప్తు, విచారణలోనూ అవసరమైన సహకారం ఈ విభాగం అందిస్తుంది. దర్యాప్తు అధికారులకు న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వనుంది. కోర్టుల్లో ఆయా కేసుల విచారణను పర్యవేక్షణ చేస్తూ, నిందితులకు శిక్షలు పడేలా చూస్తుంది. కేసులకు తార్కిక ముగింపునిస్తుంది.