Police Arrested Man For Farming Drugs in Home :అవసరమైనప్పుడల్లా కొనుక్కొని రావడం, దానికి భారీగా డబ్బులు ఖర్చు అవుతుండటం ఈ వరంగల్ వాసికి ఇబ్బందిగా మారింది. పైగా పోలీసుల సమస్య ఒకటి. దీనంతటికి ఓ పరిష్కారం కావాలనుకున్నాడు. బుర్రకు పని చెప్పాడు. ఇంట్లోనే గృహ పరిశ్రమగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. ఇలా చేస్తే తనకు ఖర్చు తప్పుతుంది, పనిలో పనిగా విక్రయిస్తే భారీగా డబ్బు కూడా లభిస్తుందని రంగంలోకి దిగాడు.
వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60), సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాల కోసం ఏకంగా ఇంటి మేడపై పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. అంతా బాగానే ఉంది, మొక్కలు కూడా పెరిగాయి, ఇక వాడుకోవడమే సరి అని అనుకుంటున్న సమయంలో ఎవరో ఈ సమాచారం పోలీసులకు అందించారు. ఇంకేముంది వరంగల్ యాంటీ డ్రగ్స్ టీం రంగంలోకి దిగింది. మత్తు పదార్థాలను పసిగట్టే పోలీస్ జాగిలంతో సోదాలు జరిపి మేడపైన గంజాయి మొక్కలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.