Group 2 Exam Halltickets : ఈనెల(డిసెంబరు) 15 (ఆదివారం), 16 (సోమవారం) తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈనెల 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఉదయం, మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్లో 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తరువాత ఎంట్రీ లేదు. మధ్యాహ్నం సెషన్‌కు 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండోది : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో గ్రూప్-2 నోటిఫికేషన్. ఈ పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయిస్తారు. ప్రతి పేపరులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 చొప్పున అడుగుతారు. మొత్తం 600ల మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులను గ్రూప్-2 అధికారులుగా ఎంపిక చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు.
- జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్ 150 (పేపర్-1)
- హిస్టరీ అండ్ పాలిటీ, సోసైటీ 150 (పేపర్-2)
- ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 150 (పేపర్-3)
- తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేషన్ 150 (పేపర్-4)
4 వాయిదాల అనంతరం : గ్రూప్-2 ఇప్పటికీ నాలుగుసార్లు వాయిదా పడింది. మొత్తం 783 పోస్టులతో 2022లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగ ప్రకటన వెలువడింది. అప్పట్లో దీనికి 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి షెడ్యూలు ప్రకారం 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగాలి. కానీ అప్పుడు గురుకుల టీచర్ ఉద్యోగాల పరీక్షలతో గ్రూప్-2కు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయామనే అసంతృప్తితో ఉన్నారు. ఇంకా కొంత సమయం ఇవ్వాలని నిరుద్యోగులు కోరడంతో స్పందించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అదే ఏడాది నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేసింది.
శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతోనే పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని వెంటనే 2024 జనవరి 6, 7 తేదీలకు రెండోసారి వాయిదా పడ్డాయి. తర్వాత ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఛైర్మన్‌గా కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక మూడోసారి ఆగస్టు 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు రీషెడ్యూల్ ప్రకటించింది. తాజాగా డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ఉండటంతో నాలుగో సారి మళ్లీ డిసెంబరుకు వాయిదా వేసింది. ఏది ఏమైనా పరీక్షలు నిర్వహిస్తేనే అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. డిసెంబరు 4న టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా సీనీయర్ ఐఏఎస్ బుర్రా వెంకటేషం నియామకం కావడంతో టీజీపీఎస్సీ పట్ల అభ్యర్థులకు మరింత విశ్వాసం పెరిగింది.
గ్రూప్స్ -2 అభ్యర్థులకు అలర్ట్ - డిసెంబర్ 9నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన