Anganwadis Rejoining Problems:సమ్మె విరమించి విధుల్లోకి చేరేందుకు వస్తున్న అంగన్వాడీలకు పాలనాపరమైన సాంకేతిక సమస్యలు తలనొప్పిగా మారాయి. జాయినింగ్ రిపోర్టు తీసుకున్న తరువాతే టెర్మినేషన్ ఆర్డర్ల రద్దు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెర్మినేషన్ ఆర్డర్ల రద్దుకు జాయినింగ్ రిపోర్టు తప్పనిసరని ఐసీడీ పీడీలు స్పష్టం చేశారు.
మరోవైపు జాయినింగ్ రిపోర్టు ఇచ్చేందుకు అంగన్వాడీలు ససేమిరా అంటున్నారు. నేరుగా విధుల్లో చేరాలని మంత్రుల కమిటీ ఇప్పటికే సూచించిందంటూ అంగన్వాడీ కేంద్రాల వద్దే వర్కర్లు, హెల్పర్లు వేచి చూస్తున్నారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 80వేల పైచిలుకు అంగన్వాడీలకు ప్రభుత్వం టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం చేసింది. ప్రస్తుతం సమ్మె విరమించి విధులకు వచ్చినా జాయినింగ్ రిపోర్టు ఇవ్వకుండా అంగన్వాడీలకు తాళాలు ఇచ్చేది లేదంటూ సూపర్‌వైజర్లు విముఖత చూపుతున్నారు.
అంగన్వాడీల నిరవధిక దీక్షకు సర్కార్ ఫుల్స్టాప్:కాగా రాష్ట్రంలో 42 రోజులు చేసిన నిరవధిక దీక్షను విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాలు ప్రకటించాయి. ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండానే అంగన్‌వాడీల ఆందోళనలకు జగన్ సర్కార్ ముగింపు పలికింది. అంగన్వాడీలపై అనేక రకాల ఒత్తిళ్లు, బెదిరింపులకు గురిచేసిన వైఎస్సార్సీపీ సర్కార్ చివరికి సమ్మెను విరమింపజేసింది.
జగన్ నియంత పాలనతోనే అంగన్వాడీలు మృతి : నారా లోకేశ్
వేతనం పెంచకపోయినా సమ్మె విరమించిన అంగన్వాడీలు:మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జలతో రాత్రి పొద్దుపోయాక జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సానుకూల అంశాలు వెలువడటంతో సమ్మెను కాల్ ఆఫ్ చేస్తున్నట్లు వెల్లడించారు. యథావిధిగా అంగన్వాడీలు అంతా విధులకు హాజరవుతామని ప్రకటించారు.
అయితే తాము కోరిన 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినందున సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. తమ ఆందోళనకు మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు అంగన్వాడీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జూలై నుంచి జీతాలు పెంచకపోతే మళ్లీ సమ్మెబాట తప్పదని అంగన్వాడీలు హెచ్చరించారు.
అంగన్వాడీల ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత - జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు : సీపీఎం
ఏడు సార్లు అంగన్వాడీల ప్రతినిధులతో చర్చలు:అంగన్వాడీల ఆందోళనపై మొదటి నుంచీ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీలు సమ్మెలో ఉన్న సమయంలో సచివాలయ సిబ్బందితో కేంద్రాలను బలవంతంగా తెరిపించింది. దీంతోపాటు నోటీసులు జారీ చేయటం, ఎస్మా ప్రయోగించటం వంటి చర్యలకు పాల్పడింది.
నామమాత్రపు హామీలతో ఆందోళనకు పుల్‌స్టాప్:చివరికి ఉద్యోగాలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా అంగన్వాడీలు తగ్గకుండా తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించేదే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జగన్ సర్కార్ అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఏడు సార్లు అంగన్వాడీ సంఘాల నేతలతో చర్చలు జరిపిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చకుండానే నామమాత్రపు హామీలతో వారి ఆందోళనకు పుల్‌స్టాప్ పెట్టింది.