Andhra Pradesh Weather Report :దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోంది. దీని ప్రభావం రాగల మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీగా, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, బుధవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది.
మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం తమిళనాడు, గురు, శుక్రవారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముంది. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఏ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం ఉంది. వర్షాలు ఎక్కడ పడతాయనే అంశాలపై విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలుపుతున్నారు.