ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ - ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ - Lok Sabha Polls 2024

Andhra Pradesh Lok Sabha election 2024: ఏపీలో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే ఒక్కో అభ్య‌ర్ధి గ‌రిష్టంగా నాలుగు సెట్ల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చని పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్​ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Andhra Pradesh Lok Sabha election 2024
Andhra Pradesh Lok Sabha election 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 8:06 PM IST

Updated : Apr 18, 2024, 6:10 AM IST

Andhra Pradesh Lok Sabha election 2024:సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవాళ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంటు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లు దాఖలు చేయాలని CEO ముకేశ్‌కుమార్‌ మీనా సూచించారు. శాసనసభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచేవారు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా రెండు చోట్ల పోటీచేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. అభ్యర్థితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని వివరించారు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు 25 వేలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 10 వేల రూపాయలు ధరావతు చెల్లించాలన్నారు.

ఎస్‌సి, ఎస్‌టీ అభ్య‌ర్ధులు దీనిలో 50 శాతం చెల్లిస్తే స‌రిపోతుందన్నారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటిస్తూ అభ్య‌ర్ధులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయాల్సి ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నామినేషన్ ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేష‌న్లను స్వీక‌రించే గ‌దిలో, అభ్య‌ర్ధులు ప్ర‌వేశించే ద్వారాల వ‌ద్దా సీసీ కెమేరాల‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడ‌ల్ కోడ్ అమ‌ల్లో భాగంగా అభ్య‌ర్ధుల ఊరేగింపుల‌ను, నామినేష‌న్ దాఖ‌లు చేసే కార్య‌క్ర‌మాల‌ను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారని ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాలి - ప్రతిరోజు నివేదికలివ్వాలి: కలెక్టర్లకు సీఈవో ఆదేశం

నామినేషన్లు దాఖ‌లు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

  • అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురాలి.
  • పార్ల‌మెంటుకు పోటీచేసే అభ్య‌ర్ధులు ఫార‌మ్ 2ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫార‌మ్ 2బీలో దర‌ఖాస్తు చేయాలి.
  • నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.
  • పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు.
  • అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.
  • నామినేష‌న్ల‌ను ఆర్ఓకు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్ర‌మే స‌మ‌ర్పించాలి.
  • అభ్య‌ర్ది త‌న నామినేష‌న్‌ను నేరుగా గానీ, త‌న ప్ర‌పోజ‌ర్ ద్వారా గానీ స‌మ‌ర్పించ‌వ‌చ్చు.
  • అభ్య‌ర్ధి నామినేష‌న్‌తో పాటు త‌మ పేరిట కొత్త‌గా తెరిచిన బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి.
  • 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.
  • నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయి.
  • అభ్య‌ర్ధితో స‌హా ఐదుగురు వ్య‌క్తులు మాత్ర‌మే ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు.
  • నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
  • సువిధ యాప్ ద్వారా నామినేష‌న్లను దాఖ‌లు చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, వాటి కాపీల‌ను భౌతికంగా ఆర్ఓకు అంద‌జేయాల్సి ఉంటుంది.
  • ఫార‌మ్‌-26 ద్వారా త‌న అఫ‌డ‌విట్‌ను స‌మ‌ర్పించాలి.
  • ఫారమ్ 26 స్టాంప్ పేపర్ విలువ రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
  • భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే E స్టాంప్ కూడా ఉపయోగించవచ్చు.
  • అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు.
  • పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు.

ఎన్నికల ప్రక్రియ షెడ్యూలు, ముఖ్య‌మైన తేదీలు

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ: 18 ఏప్రిల్ 2024 (గురువారం)
  • గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది.
  • నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం)
  • నామినేషన్ల పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
  • అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
  • పోల్ తేదీ: 13 మే 2024 (సోమవారం)
  • కౌంటింగ్ తేదీ : 04 జూన్ 2024 (మంగళవారం)
  • ఎన్నికలు ముగిసేలోపు తేదీ : 06 జూన్ 2024 (గురువారం)

రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం వద్దు - సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందన్న ఈసీ

Last Updated : Apr 18, 2024, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details