Andhra Pradesh IT Minister Nara Lokesh Blocked WhatsApp : యువగళం ద్వారా నేరుగా ప్రజల జీవన స్థితిగతులను పరిశీలించిన ఏపీ టీడీపీ నేత, మంత్రి లోకేశ్ సామాన్యుల సమస్యలపై స్పందించారు. ఒక్క మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తానని భరోసా కల్పించారు. ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏ సహాయం కావాలన్నా, మార్గదర్శకం కావాలన్నా అన్నగా తోడుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో లోకేశ్ వాట్సప్ నంబర్‌కు సమస్యల మెస్సెజ్‌లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో మెటా బ్లాక్ చేసింది. దీనిపై లోకేశ్ ఏమన్నారంటే?
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సప్‌ను మెటా బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్ వాట్సప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని ఒక ప్రకటనలో కోరారు.
మెసేజ్‌లకు మంత్రి లోకేశ్ స్పందన : సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే ప్రకటించిన లోకేశ్, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో తన వాట్సప్‌కి వచ్చిన మెసేజ్‌పై స్పందించిన మంత్రి లోకేశ్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు.