AP High CourtDismissed Allu Arjun Case :సినీ నటుడు అల్లు అర్జున్, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా హైకోర్టు వీరిద్దరిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ అనుమతి లేకుండా నంద్యాలలో ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అల్లుఅర్జున్ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా ఆయనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగింది : ఏపీ ఎన్నికల సమయంలో సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆయన అభిమానులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన పర్యటనకు అధికారికంగా ఎలాంటి అనుమతులూ లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.
ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై అప్పట్లో నంద్యాల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపై వేసిన కేసులను కొట్టేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు నేడు వీరిద్దరిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆదేశాలు ఇచ్చింది.