Free Sand Policy Guidelines: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచించింది. 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం పేర్కొంది.
వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానం - రేపు శ్వేతపత్రం విడుదల - white paper on sand
రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు ఆదేశించింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్దారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో లారీలు, ట్రాక్టర్లు ఇసుక రీచ్‌లకు క్యూ కట్టాయి. వ్యాపారులు, కొనుగోలుదారులతో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కోలాహలం నెలకొంది. చాలా జిల్లాల్లో ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు ప్రారంభించారు. భవన నిర్మాణ రంగానికి పూర్వవైభవం సంతరించుకుంటుందని, చేతినిండా పని దొరుకుతుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు చేసుకుంటున్నారు.
అదే విధంగా ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం అస్తవ్యస్తంగా మారింది. దీంతో నిర్మాణ రంగం కుదేలై లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - నేటి నుంచే ఉచిత ఇసుక - Free Sand Policy in AP