AP Govt Exercise On Budget 2024-25 :బడ్జెట్ పద్దు ఏ రూపంలో పెడదాం అన్న అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అంశం పై ఆలోచన చేస్తున్న సర్కార్, ఎన్నికల తర్వాత కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదనలు ఏవీ సిద్ధంగా లేకపోవడంతో దీనినే కొనసాగించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తోంది.
దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి : గత వైఎస్సార్సీపీ సర్కార్ అస్తవ్యస్త వ్యవహారంతో పాటు, వెళ్తూ వెళ్తూ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేకుండా అసాంతం ఊడ్చేశారు. కనీసం ప్రభుత్వానికి కొత్తగా అప్పులు కూడా చేయడానికి వీలులేని పరిస్థితి కల్పించేసి వెళ్లిపోయారు. ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ఎంతో హుషారుగా గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి, ఇప్పుడు అప్పటి సర్కార్ నిర్వాకం చూసి నీరుగారిపోవాల్సి వస్తోంది. కనీసం బడ్జెట్ పెట్టుకోవాలంటే కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది.
Vote on Account Budget in AP : ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి పద్దు రూపొందించడం, కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారుతోంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన సర్కార్, ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలంటే పద్దు ప్రవేశపెట్టడం తప్పనిసరి. దీంతో ఈ నెల 22న శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. నాలుగు నెలల కాలానికి ఈ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ కాలానికి ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలం పూర్తవుతుంది కాబట్టి, మిగిలిన ఆరు నెలల కాలానికి పూర్తి స్థాయి పద్దు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.