Andhra Pradesh Debt: జగన్ పాలనలో రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం జనవరి ప్రారంభానికే 10లక్షల21 వేల కోట్ల రూపాయలను దాటింది. ప్రభుత్వ అప్పుతో మనకేంటి పని? సర్కారే తీర్చుకుంటుంది కదా అనుకుంటే పొరపాటే. నిజానికి ఆ అప్పులన్నీ తీర్చేది ప్రజలే. ప్రభుత్వం తనకొచ్చే రాబడి నుంచే ఈ రుణాలను తీరుస్తుంది. ఆదాయంలోనూ 70శాతం ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. అంటే ప్రభుత్వ అప్పులు పెరిగే కొద్దీ పౌరులపై పన్నుల భారం అదేస్థాయిలో పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే జగన్ సర్కారు జనం జేబుల్లోంచి అనేక రూపాల్లో డబ్బులు లాగేసుకుంది. వారిపై ఇతర రాష్ట్రాల్లో కనిపించని ఎన్నో భారాలు మోపి, బాదుడే బాదుడు కొనసాగించింది.
ప్రజలపై మోపిన భారం లక్షా 8 వేల కోట్లు: వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో వివిధ పన్నులు, ఛార్జీల రూపంలో ప్రజలపై మోపిన భారం లక్షా 8 వేల కోట్ల రూపాయలు. ప్రజల నుంచి ఏ స్థాయిలో పిండుకుందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి . దీంతో ఏపీలో అమలవుతున్న పన్నులకు, పొరుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులకు మధ్య చాలా తేడా ఉంటోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు ధరల భారం ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర 111 రూపాయల 87 పైసలుగాఉండగా, కర్ణాటకలో 101 రూపాయల 94 పైసలుగా, తమిళనాడులో 102 రూపాయల 70 పైసలుగా, ఒడిశాలో 103 రూపాయల 19 పైసలుగా, తెలంగాణలో 109 రూపాయల 66 పైసలుగా ఉంది. ఏపీలో లీటరు డీజిల్ ధర 99 రూపాయల 61 పైసలు ఉండగా కర్ణాటకలో 87 రూపాయల 89 పైసలు, తమిళనాడులో 94 రూపాయల 24 పైసలు, ఒడిశాలో 94 రూపాయల 76 పైసలు, తెలంగాణలో 97 రూపాయల 82 పైసలుగా ఉంది. ఈ అదనపు భారంతో ఆటో డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు, సామాన్య, మధ్య తరగతి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలికిన సీఎం జగన్
ప్రభుత్వానికి ఆదాయం ఇలా: పన్నుల రాబడి, పన్నేతర రాబడి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు ఈ మూడింటితోనే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నా, అభివృద్ధి పనులు చేయాలన్నా, అప్పులు తీర్చాలన్నా, వడ్డీలు చెల్లించాలన్నా ఈ ఆదాయమే ఆధారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడి అంచనా చూస్తే పన్నుల రాబడి లక్షా 43 వేల 989.37 కోట్ల రూపాయలుగా, పన్నేతర రాబడి 15 వేల 400 కోట్లుగా ఉంది.
కేంద్ర గ్రాంట్లు 46 వేల 834.64 కోట్ల రూపాయలు కాగా, మొత్తం 2 లక్షల 6 వేల 224.01 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం సమకూరాలంటే 70 రూపాయలను పన్నుల రూపంలో ప్రజల జేబుల్లో నుంచి తీసుకుంటుంది. ముఖ్యంగా జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇతర సుంకాలను ప్రజలపైనే వేస్తుంది. పెద్దఎత్తున అప్పులు చేస్తూ వాటిని తీర్చ లేక జగన్ సర్కారు జనంపై ఇప్పటికే ఎన్నో భారాలు మోపింది.