AP Cabinet Decisions : ఏపీలో వరుసగా రెండేళ్లు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తట్టుకునేలా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని తాగు, సాగునీటి అవసరాలకు కొరత లేకుండా మొత్తం చెరువులు, కుంటలు నింపాలని సూచించారు. నదులకు జల హారతులు ఇవ్వాలన్నారు. వన భోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు వివరించారు.
CM Chandrababu Cabinet Key Decisions : జనసేన తరపున మన ఊరు- మన నది పేరుతో కార్యక్రమాలు చేసినట్టుగా పవన్ చెప్పగా అలాంటి ఉత్తమ విధానాలతో కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు 13 గేట్లు పాడైపోయాయని, వాటిని మార్చేందుకు రూ.9.75 కోట్లు ఖర్చవుతుందని మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. వాటిని అమర్చేందుకు నెల పడుతుందని అప్పటి వరకు 1.6 టీఎంసీలు నిల్వ చేయవచ్చని అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలి :ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలని ఆవేశంలో తప్పులు చేయకుండా సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. చిన్న ఘటన జరిగినా యాగీ చేసేందుకు విపక్షం కాచుకుని కూర్చుందన్నారు. పాలకులు చేసే తప్పులకు ప్రజల్లో ఎంత తీవ్రమైన స్పందన వస్తుందో చెప్పేందుకు బంగ్లాదేశ్ పరిణామాలే నిదర్శనమన్న చర్చ జరిగింది. ప్రజాస్వామ్య దేశం కాబట్టి రాష్ట్రంలో గత పాలకులు చేసిన అరాచకాలపై ప్రజలు ఓటు ద్వారా స్పందించారని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు.
నియంతృత్వ పోకడలకు తావులేదు : ప్రజాసామ్యంలో నియంతృత్వ పోకడలకు తావులేదని చంద్రబాబు స్పష్టంచేశారు. భిన్న గొంతుకలను అణచివేయాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. హద్దులు దాటి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించనంత వరకు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు, భావప్రకటనకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
పాలనాపరమైన అవసరాల మేరకే ఉద్యోగుల బదిలీలు చేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలతో రోజువారీ సంబంధాలుండే ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల్నే బదిలీ చేస్తూ ఉపాధ్యాయులు, వైద్యులు వంటివారిని బదిలీ చేయకూడదని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.600 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ అప్పటి సీఎం జగన్ బొమ్మలతో సిద్ధం చేసిన గ్రానైట్ సర్వేరాళ్లను ఏం చేయాలన్న చర్చ జరిగింది. ఆ రాళ్లపై జగన్ బొమ్మల్ని తొలగించాలని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. వాటిని గుడులు, బడుల నిర్మాణంలో వాడుకోవచ్చునని కొందరు, పేవ్‌మెంట్‌లకు వాడొచ్చని మరికొందరు సూచించారు.