ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఎన్డీయేకు అత్యధిక మెజార్టీతో పట్టం - ఆ జిల్లాలో వైఎస్సార్సీపీ ఖాతా తెరవదు! - Andhra Pradesh Exit Polls 2024

Andhra Pradesh Exit Polls 2024: రాజకీయంగా అత్యంత ఉత్కంఠ, ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్డీయే కూటమినే విజయం వరించబోతోందని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయదుందుభి మోగించబోతోందని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. జాతీయ మీడియా ఛానెళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజారిటీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి. ఏపీకి సంబంధించి దాదాపు 40 సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించగా అందులో 35 టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిదే పీఠమని తేల్చాయి. ఐదు మాత్రమే వైఎస్సార్సీపీకి మొగ్గు చూపాయి. ఎన్డీయే కూటమికి ఏపీలో 53శాతం ఓట్లు వస్తాయని ఇండియాటుడే సర్వే తెలిపింది.

Andhra Pradesh Exit Polls 2024
Andhra Pradesh Exit Polls 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 8:51 AM IST

రాష్ట్రంలో ఎన్డీయేకు అత్యధిక మెజార్టీతో పట్టం - ఆ జిల్లాలో వైఎస్సార్సీపీ ఖాతా తెరవదు! (ETV Bharat)

Andhra Pradesh Exit Polls 2024 :రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. ఏకపక్ష విజయంతో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సర్వేలన్నీ ఢంకా బజాయించాయి. సైకిల్ స్పీడ్‌కు వైఎస్సార్సీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని మెజార్టీ సర్వేలు తేల్చాయి.అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్‌సభ మాదిరిగానే ఫలితాలుంటాయని శనివారం వెల్లడైన పలు సర్వేలుతేల్చాయి.

Andhra Pradesh Assembly Exit Poll 2024 Highlights :ఎగ్జిట్‌ ఫలితాల్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో ఆరు ఎన్డీయే కూటమి ఈసారి ఆంధ్రావనిలో అధికారంలోకి వస్తోందని స్పష్టం చేయటం గమనార్హం! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడి పొత్తులతో కలసి కట్టుగా బరిలోకి దిగిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి దాదాపు అన్ని సర్వేలూ 100కుపైగా సీట్లు వస్తాయని చెప్పాయి.

కేకే సర్వే :ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ కూటమి రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది. 175 స్థానాలకుగాను కూటమి 161 సీట్లు సాధించనుందని, వైఎస్సార్సీపీ కేవలం 14 సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని కేకే సర్వేస్‌ అధినేత కేకే మూర్తి తెలిపారు. 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 133 సీట్లు, జనసేన పోటీ చేసిన 21, బీజేపీ 10 సీట్లకుగాను 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంట్‌ స్థానాల్లో 25కి 25 సీట్లను కూటమి కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేయవచ్చన్నారు. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఖాతా కూడా తెరవదని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ అంచనాలు నిజమయ్యాయని ఆయన తెలిపారు.

ఎగ్జిట్ పోల్స్ - ఏపీలో ఏ పార్టీకి ఎన్ని లోక్​సభ స్థానాలంటే! - Lok Sabha Exit Polls Result 2024

రైజ్‌ సంస్థ :రైజ్‌ సంస్థ కూటమికి 113నుంచి 122 స్థానాలు వస్తాయని చెప్పింది. వైఎస్సార్సీపీకి 48నుంచి 60 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీకి 92 నుంచి 99 సీట్లు, జనసేనకు 11 నుంచి 16 సీట్లు, బీజేపీకి 0 నుంచి 3 స్థానాలు రావొచ్చని తెలిపారు. కూటమికి 50.49 శాతం ఓట్లు, వైసీపీకు 44.86 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ఇతరులకి 4.65 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కూటమి 17 నుంచి 20 లోక్‌సభ స్థానాలు, వైసీపీకి 7 నుంచి 10 లోక్‌సభ స్థానాలు వస్తాయని సర్వేలో తేలిందన్నారు.

చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే :మిగతా సర్వేలు గమనిస్తే చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే ప్రకారం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం కూటమి114 నుంచి 125 సీట్లు చేజిక్కించుకోనుండగా వైఎస్సార్సీపీ 39 నుంచి 49 స్థానాలకు మించదని తేల్చి చెప్పింది. ఇతరులు ఒక స్థానం గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఇక లోక్‌సభ విషయానికొస్తే తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 18 సీట్లు దక్కించుకోనుండగా వైసీపీ 6 నుంచి 7 స్థానాలకే పరిమితం కాబోతోందని వెల్లడించింది.

పయనీర్ సర్వే :తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్నందుకోబోతున్నట్లు పయనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి అత్యధికంగా 144 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ 31 సీట్లతో చతకిలపడడం ఖాయమని తేల్చింది. ఇక లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 20, వైసీపీ 5 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది. జనగళం సర్వే సంస్థ కూడా కూటమికే జనామోదమని స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి 104 నుంచి 118 స్థానాలు గెలుచకోనుండగా వైసీపీ 44 నుంచి 57 స్థానాలకు పరిమితం కాబోతోందని తెలిపింది.

ఏపీలో మార్పు ఖాయం- కూటమికి పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్ - andhra pradesh exit polls 2024

ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వే :ప్రముఖ జాతీయ ఛానెళ్ల సర్వేల్లో ఒకటి తప్ప అన్నీ ఎన్డీయే కూటమి విజయం ఖాయమని ముక్తకంఠంతో చెప్పాయి. ఇటీవలి కాలంలో దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో 53శాతం ఓట్లు రావొచ్చని అధికార వైఎస్సార్సీపీ 41శాతం ఓట్లతో కేవలం 2నుంచి 4 సీట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది.

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ను కొన్ని జాతీయ ఛానెళ్లు ఆదివారం వెల్లడించనున్నాయి. ఇండియా టీవీ కూడా రాష్ట్రంలో కూటమిదే ఆధిపత్యమని తేల్చింది. 25 లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 13 నుంచి 15, బీజేపీ 4 నుంచి6, జనసేన 2 సీట్లు గెలుచకుంటుందని తెలిపింది. ఇక వైసీపీ 3 నుంచి 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని అంచనా వేసింది.

CNX అనే సంస్థ కూడా కూటమిదే హవా అని తేల్చింది. తెలుగుదేశం 13 నుంచి 15 , బీజేపీ 4 నుంచి 6, జనసేన 2, వైసీపీ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది. ఏబీపీ - సీ ఓటర్‌ సంస్థ తెలుగుదేశం కూటమికి 21 నుంచి 25 స్థానాలు కట్టబెట్టగా వైసీపీ నాలుగు స్థానాల వరకూ గెలుచుకోవచ్చని తెలిపిందిఇండియా న్యూస్- డీ-డైనమిక్స్‌ కూడా తెలుగుదేశం కూటమి 18 స్థానాలు గెలుచుకోనుండగా వైసీపీ 7 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

న్యూస్‌-18 సంస్థ కూడా తెలుగుదేశం కూటమిదే విజయమని తేల్చింది. టీడీపీ కూటమి అత్యధికంగా 19 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకోనుండగా వైసీపీ 5 నుంచి 8 స్థానాలకు పరిమితం కావాల్సిందేనని స్పష్టం చేసింది. మరో జాతీయ సంస్థ టుడేస్‌ చాణక్య కూడా తెలుగుదేశం కూటమికే పట్టం కట్టింది. ఆ కూటమి 19నుంచి 25 స్థానాలు గెలుచుకోనుండగా వైసీపీ సున్నా నుంచి 6 స్థానాలు దక్కించుకోవచ్చని తెలిపింది. జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌ నౌ మాత్రం వైసీపీకి 13 నుంచి 15 లోక్‌సభ స్థానాలు గెలవొచ్చని తెలిపింది. తెలుగుదేశం 7 నుంచి 9 స్థానాలు, జనసేన 1, బీజేపీ 2 సీట్లు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​- మూడోసారి మోదీయే! అన్ని సర్వేల్లో బీజేపీకే మెజార్టీ స్థానాలు!! - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details