Anantapur Bananas Exports to Arab Countries : అనంత అరటి రైతులకు మంచి రోజులొచ్చాయి. మన అన్నదాతలు పండించిన పండ్లు దేశవిదేశాలకు చేరుతున్నాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలకు ఇక్కడి అరటి ఉత్పత్తుల ఎగుమతికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు రోడ్డు మార్గంలో వివిధ నగరాలకు సరఫరా అవుతుండగా తాజాగా రైలు, జల రవాణా మార్గాల ద్వారా ఖండాంతరాలు దాటనుంది.
జీ-9 అరటి రకం 34 బోగీల్లో 680 మెట్రిక్ టన్నులు ఎగుమతికి సిద్ధం చేశారు. నేడు ( తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో (ప్లాట్‌ఫారం-2) రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఉన్నతాధికారులు వర్చువల్ ద్వారా రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.
గెలలతో అరటితోట (ETV Bharat) అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ముంబయికి రైల్వే బోగీల్లో వెళుతుందని, అక్కడ్నుంచి ఓడల్లో రవాణా చేస్తామని ఉద్యానశాఖ అధికారులు, ఎస్‌కే బనానా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు పోలీసు సెక్యూరిటీ, ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్తు, ఇంటర్‌నెట్ సౌకర్యం, డిజిటల్ స్క్రీన్లు, టీవీల ఏర్పాటు వంటి సదుపాయాలపై అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులతో సమీక్షించారు.
34 వ్యాగన్లలో రవాణా : జిల్లాలో పండించిన అరటిని కొనేందుకు 2018 దిల్లీకి చెందిన దేశాయి ఫూట్స్ వెజిటెబుల్ కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. అప్పట్లో ఏటా 12-15 వేల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేశారు. అరబ్ దేశాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా పంపడం ఇది రెండోసారి. తాజాగా శ్రీకృష్ణ ఇంపెక్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ జీ-9 అరటిని కొనుగోలు చేసింది. మార్చి వరకు కాయలు నాణ్యతగా ఉంటే ఇంకోసారి కూడా పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉద్యానశాఖ అధికార వర్గాలు తెలిపాయి. కిలో రూ.27 చొప్పున టన్ను రూ.27 వేలతో కొనుగోలు చేశారు. ఈ సొమ్ము రైతు ఖాతాలకే నేరుగా జమ చేస్తున్నారు. శీతల గోదాముల నుంచి వ్యాగన్ల ద్వారా తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు తరలించేందుకు సిద్ధం చేశారు.
ఒక్క చెట్టు - ఐదు అరటి గెలలు - అనంత జిల్లాలో వింత
హస్తాలతో గ్రేడింగ్ : పుట్లూరు, నార్పల మండలాల్లో 13-15 సెంట్రిగ్రేడ్ ఉన్న శీతల గోదాముల్లో అరటిని పెట్టెల్లో ఒక్కో దానిలో 10.4 కిలోలు చొప్పున భద్రపరుస్తున్నారు. నాలుగు హస్తాలు ఉంటే ‘ఏ’ గ్రేడ్‌గాను, ఆరైతే ‘బి’ గ్రేడ్‌గాను, ఎనిమిదితైతే ‘సి’ గ్రేడ్‌గాను కాయలను మాత్రమే సిద్ధం చేస్తారు. మిగిలిన వాటిని దిల్లీ, ముంబాయి నగరాల్లో విక్రయించనున్నారు. కాయల నాణ్యతపై ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన తర్వాత ఎగుమతికి అనుమతిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 27,170 ఎకరాల్లో అరటి సాగులో ఉంది. జీ-9 రకమే అధికంగా ఉంది. ఎకరాకు 22 టన్నులు చొప్పున మొత్తం 5,97,740 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తోందని ఉద్యానశాఖ అంచనా వేసింది.
జిల్లాలో ఒక్క యాపిల్ తప్ప 24 రకాల పండ్లు పండుతున్నాయని ఉద్యానశాఖ ఉప సంచాలకులు నరసింహారావు తెలుపుతున్నారు. ఇక్కడ పంటలకు భలే గిరాకీ ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాయలు రుచి, వాసన ఉంటుందని, అరబ్ దేశాలకు మన పంటలనే ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు గుర్తింపు పొందిన పెద్ద కంపెనీల సంస్థల ప్రతినిధులు ముందుకొస్తున్నారని వివరిస్తున్నారు. గతంలో టన్ను రూ.12,500 కొనుగోలు చేయగా, తాజాగా టన్ను రూ.27 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారని, ధర బాగుంది నరసింహారావు అంటున్నారు.
CROP DAMAGE DUE TO UNTIMELY RAIN: అకాల వర్షం - అపార నష్టం.. లబోదిబోమంటున్న రైతన్నలు..