AP Budget 2024 :ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ (AP Budget 2024) ప్రవేశపెట్టింది. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పునరుజ్జీవం పోయడమే లక్ష్యమని ప్రకటించింది. సరళమైన ప్రభుత్వం ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని ఉద్ఘాటించింది.
రాష్ట్ర ఆర్థిక రథం గాడిన పెడతాం : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) శాసన సభలో ప్రవేశపెట్టారు. మొత్తంరూ.2.94లక్షల కోట్లతో పద్దు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2లక్షల34 వేలకోట్లుగా మూలధన వ్యయాన్ని 32 వేల 712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34 వేల 743 కోట్లు, ద్రవ్య లోటు 68 వేల 743 కోట్లుగా ఉండొచ్చని, ఉండొచ్చని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి - జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉండొచ్చని వివరించారు. వైఎస్సార్సీపీ సర్కార్ అరాచకాల వల్లే రాష్ట్ర ఆర్థిక రథం అగాథంలో కూరుకుపోయిందని, దాన్ని మళ్లీ గాడిన పెడతామని పయ్యావుల వివరించారు.
రంగాల వారీగా చూస్తే ఉన్నత విద్యకు 2వేల 326 కోట్లు, ఆరోగ్యరంగానికి 18 వేల 421 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. పద్దులో సంక్షేమానికి, అందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 39వేల 7 కోట్లు కేటాయించారు. ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7వేల 557 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4 వేల 376 కోట్లు ప్రతిపాదించారు. మహిళా శిశుసంక్షేమ శాఖకు 4వేల285 కోట్లు దక్కాయి. ఇక కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు 29 వేల 909 కోట్లు, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధిక కల్పనకు కీలకమైన నైపుణ్యాభివృద్ధి శాఖకు 12 వందల 15 కోట్లు కేటాయించారు.