AMARAVATI OUTER RING ROAD: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని నిర్మాణ పనులను కూటమి సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతికి వడ్డాణంలా భాసిల్లే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది.
23 మండలాలు, 121 గ్రామాల మీదుగా: రాష్ట్రంలో మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఓఆర్‌ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్‌ఆర్ వెళుతోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు.
తూర్పు బైపాస్ బదులు రెండు లింక్ రోడ్ల నిర్మాణం: 189.9 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌కు ఇటీవల ఆమోదం తెలిపిన ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్‌ఆర్‌కి అనుసంధానం ఉన్నట్లే, చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్‌ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికి మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధం చేశారు.