Amaravati construction work to begin from March 15th:అమరావతి నిర్మాణ పనులు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలిచినా ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకూ సీఆర్డీఎ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 62 పనులకు టెండర్లు పిలిచింది. సుమారు రూ.40 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పనులు చేస్తారని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే టెండర్లు ఖరారు: అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితం అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈసీ రాజధానిలో పనులకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని లేఖలో పేర్కొంది.