Allu arjun On Sandhya Theatre Incident :సంధ్య థియేటర్ ఘటనలో తన వ్యక్తితత్వాన్ని కించపరుస్తూ ఆరోపణలు చేయడం తగదని నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 22 ఏళ్ల కష్టాన్ని ఒక్క రాత్రి తుడిచిపెట్టుకుపోయేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బన్నీ వాపోయారు. డిసెంబరు 4న జరిగిన ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.
ఆ రోజు జరిగిన ఘటన చాలా దురదృష్టకరం :పోలీసుల అనుమతితోనే తాను థియేటర్ వద్దకు వచ్చానని అల్లు అర్జున్ చెప్పారు. బయట జరిగిన విషయాలపై పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. థియేటర్ యాజమాన్యం వచ్చి చెబితేనే తాను వెళ్లిపోయానని బన్నీ వివరించారు. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయలేదని స్పష్టం చేశారు.సంధ్య థియేటర్ ఘటన జరిగినప్పటి నుంచి తన మీద కొంత తప్పుడు ప్రచారం జరుగుతోందని, తన క్యారెక్టర్‌ను కించరపరిచారని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పేర్కొన్నారు.
కుటుంబానికి అండగా ఉంటా : ఈరోజు తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి, గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్ కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు. శ్రీతేజ్ భవిష్యత్ బాగుండేలా బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తన వ్యక్తితత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం పట్ల అల్లు అర్జున్ కన్నీంటి పర్యంతమయ్యారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.