Alliance Win in GVMC Standing Committee Elections:మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు హవా కొనసాగించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 10 స్థానాలను గెలుచుకొని కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏడుగురు అభ్యర్థులకు 60కి మించి ఓట్లు పడ్డాయి. అత్యధికంగా విల్లూరి భాస్కరరావు 66 ఓట్లు కైవశం చేసుకున్నారు. జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో నేతలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు. కూటమి గెలుపుపై ఎమ్మెల్యేలు గండి బాబ్జి, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ - YCP Corporators To Joined Janasena
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా, మిగిలిన వాళ్లతో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు జరగగా మూడు సార్లు వైఎస్సార్సీపీ సభ్యులే గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న కూటమి స్థాయీ సంఘం ఎన్నికల్లో మూడు సంవత్సరాల తర్వాత అన్ని స్థానాలను కైవసం చేసుకుంది.