Allegations on YSRCP Candidates List : నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పిందే చెబుతూ నిత్యం అసత్యాలను జపించే ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల కేటాయింపుల్లో మాత్రం 'నా' వర్గానికే ప్రాధాన్యమని తేల్చేశారు. మొదటి నుంచి పార్టీలో, ఐదేళ్లుగా ప్రభుత్వంలో అగ్రతాంబూలం అందుకుంటున్న తన సొంత సామాజిక వర్గానికే మరోసారి పెద్దపీట వేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 49 (Andhra Pradesh Assembly Elections 2024) , ప్రకటించిన 24 లోక్‌సభ స్థానాల్లో ఐదు చోట్ల తన సొంత సామాజిక వర్గం వారికే సీట్లు కట్టబెట్టారు.
ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సగటున 80 శాతానికిపైగా సీట్లలో తనవారికే పోటీ చేసే అవకాశమిస్తూ 'నా' వాళ్లంటే నా సామాజిక వర్గమేనని తేల్చి చెప్పారు. తాను నిత్యం ప్రవచించే సామాజిక న్యాయానికి ఇడుపులపాయ ఎస్టేట్ సాక్షిగా సమాధి కట్టారు. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వుడ్ స్థానాలు మినహా ఒక్కటీ అదనంగా ఇవ్వలేదు. 25 మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. 15 మందిని బదిలీచేశారు. ఆరుగురు సిట్టింగుల స్థానంలో వారసులకు అవకాశమిచ్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయించనున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం 46 మందికి దక్కింది.
విశాఖ ఉక్కు ఊపిరి తీశారు - మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్
YSRCP Candidates List Issues : సీమ జిల్లాల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అర్హత మరెవరికీ లేదనుకున్నారో, ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో మరి, ఎక్కువ సీట్లను సొంత సామాజికవర్గానికే ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలో జనరల్ సీట్లు 8 ఉంటే అందులో 7 చోట్ల తన సామాజిక వర్గీయులనే బరిలో నిలిపారు. ఇది 87శాతం పైనే. బడుగుల జిల్లా అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 12 జనరల్ సీట్లున్నాయి. ఇందులో 8 సీట్లను సీఎం సొంత సామాజికవర్గం వారికి కేటాయించారు.