ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదానీ లంచం కేసు - వైఎస్సార్సీపీ సర్కార్​కు భారీగా ముడుపులు - ADANI SCAM CASE

వెలుగులోకి వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో మరో భారీ కుంభకోణం - అదానీ గ్రూప్​ నుంచి జగన్ రూ.1,750 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు

Former CM Jagan Bribe Received From Adani Group
Former CM Jagan Bribe Received From Adani Group (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 6:00 PM IST

Former CM Jagan Bribe Received From Adani Group : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్‌ జిల్లా కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్‌ సర్కార్‌ పాత్ర వెలుగుచూసింది. సోలార్‌ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులకు 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని అదానీ నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూటర్‌ కేసుపత్రాల్లో పేర్కొన్నారు. 2029 కోట్లలో ఆనాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్ద జగన్‌కే రూ.1750 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించింది. జగన్‌ను విదేశీ అధికారిగా అమెరికన్‌ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లు పాలించి అనేక కుంభకోణాలకు తెరతీసిన వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అది కూడా అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చారని న్యూయార్క్ జిల్లా కోర్టులో నమోదైన కేసులో పత్రాలను పరిశీలిస్తే జగన్ సర్కార్‌ ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్‌తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగింది.

Adani Group Jagan Government Agreement: 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గడ్, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు 7 వేల మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది. అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది.

2021 అక్టోబరు 14న నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే డిస్కంలు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై నాటి ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, డిస్కమ్‌ల తరపున సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్ధన్ రెడ్డి, ఇతర అధికారులు సంతకాలు చేశారు. 2.3 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్ల పాటు యూనిట్‌కు 2.49 రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అదే సమయంలో గుజరాత్ రాష్ట్రానికి యూనిట్‌ను రూపాయి 99పైసలకే సెకీ ద్వారా అదానీ గ్రీన్‌ ఎనర్జీ విక్రయించింది.

జగన్ మెడకు అదానీ స్కామ్ - చేతులు మారిన రూ.1750 కోట్లు - అమెరికా కోర్టు ఆరోపణ

అయితే ఇవన్నీ తెరముందు జరిగిన అధికారిక ఒప్పందాలు. ఒప్పందాలు కుదరడానికి తెరవెనక పెద్ద భాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల్లో తెలుస్తోంది. అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థా ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూపు ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అంటే అదానీ గ్రీన్‌ఎనర్జీ కంపెనీ, దానికి అనుబంధంగా ఉన్న మారిషస్‌కు చెందిన పునరుత్పాదక సంస్థ అమెరికా ఇష్యూయర్‌ ప్రతినిధులు ఈ అవినీతికి తెరలేపినట్లు వెల్లడించారు.

గౌతమ్ అదానీ, అదానీ మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ బోర్డు సభ్యుడు వినీత్ జైన్‌, ఇతరులు అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇవ్వడం ద్వారా ఒప్పందాలకు మార్గం సుగమం చేశారని అమెరికన్ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 2029 కోట్ల లంచాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో 7 గిగా వాట్ల విద్యుత్‌ కొనేందుకు ఒప్పందం చేసుకున్నందుకు 2019 మే నుంచి 2024 జూన్‌ వరకు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాధినేత జగన్‌కే 1750 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒప్పందంలో భాగంగా ఛత్తీస్‌గడ్‌, తమిళనాడు, ఒడిశా, జమ్మూకశ్మీర్‌కు 650 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని యూఎస్‌ ఇష్యూయర్ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు 2.3 గిగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని సెకీతో పీపీఏ కుదుర్చుకుంది. రాష్ట్రాలు కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందంలో మెగావాట్‌ను బట్టి లంచం ధరను నిర్ణయించినట్లు తెలిపారు.

అమెరికా ఆరోపణల ఎఫెక్ట్​- భారీ నష్టాల్లో అదానీ కంపెనీల స్టాక్స్- రూ.2.45 లక్షల కోట్లు ఆవిరి

ఈ 2029 కోట్ల రూపాయల లంచాల్లోని యూఎస్‌ ఇష్యూయర్ వాటా కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్ద జగన్‌కు 583 కోట్లుగా, మిగిలిన రాష్ట్రాలకు 55 కోట్లుగా దిల్లీలో గౌతమ్‌ అదానీ సమక్షంలో నిర్ణయించారని అమెరికన్ ప్రాసిక్యూటర్ వివరించారు. తర్వాత గౌతమ్‌ అదానీ సూచన మేరకు యూఎస్ ఇష్యూయర్ 2.3 గిగావాట్ల పీపీఏను ఉపసంహరించుకుంది. ఈ మేరకు 2022 డిసెంబరు 7న సెకీకి లేఖ రాసింది. తర్వాత పీపీఏను అదానీ గ్రీన్‌కు కేటాయించేలా సెకీలో చక్రం తిప్పినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ అవినీతి వ్యవహారాన్ని దాచి ఒప్పందాలను చూపించి మొత్తం 12 గిగా వాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూపు అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి బిలియన్ డాలర్లను సమీకరించినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ వివరించారు.

2020 నుంచి 2024 మధ్య అదానీ గ్రూపు 2 బిలియన్ డాలర్ల నిధులను అమెరికన్ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సేకరించినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభాలు సాధించేలానేది ఈ మొత్తం అవినీతి వ్యవహారంవెనక అసలు ఉద్దేశమని అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ చెప్పారు. ఈ వ్యవహారం ఒప్పందాలు, దానికి సంబంధించిన పత్రాలను అదానీ గ్రీన్ బోర్డు సభ్యుడైన వినీత్ జైన్‌ తన సెల్‌ఫోన్‌లో చి‌త్రీకరించారు. అదే సమచారం అదానీ మేనల్లుడు సాగర్‌కు చేరవేశారు. 2023 మార్చి 17న ఎఫ్​బీఐ ప్రత్యేక ఏజెంట్లు అమెరికాలో ఉన్న సాగర్‌ అదానీ ఇంటిలో వారంట్ తీసుకుని సోదాలు చేశారు. ఆ సోదాల్లో ఎలక్ట్రానిక్ డివైస్‌లను జప్తు చేశారు. ఆ డివైస్‌లను విశ్లేషించగా లంచాలు అంశం వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్ సందేశాల్లో గౌతమ్ అదానీని న్యూమరో ఉనో, ద బిగ్ మేన్‌ అంటూ మారుపేర్లతో సంబోధించినట్లు తేలింది.

అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి : రాహుల్ గాంధీ

ABOUT THE AUTHOR

...view details