Parakamani Scam In Tirumala : దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు తర్వాత కోర్టులో శిక్ష విధించి జైలుకు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నం. ఏళ్లతరబడి శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైనటువంటి రవికుమార్‌తో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజీ చేసుకోవాలని పోలీసు అధికారి ఒకరు అప్పటి విజిలెన్స్ ఏవీఎస్‌ఓపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారుతోంది. ఆ పోలీసు అధికారిని వెనకుండి నడిపించిందెవరనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి.
అసలింతకీ ఏం జరిగింది? :ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలోని పెద్దజీయంగారి మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నటువంటి సి.వి.రవికుమార్ పరకామణి లెక్కింపు సమయంలో మఠం ప్రతినిధిగా వ్యవహరించారు. 2023 ఏప్రిల్ 29న అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి చంద్ర అనే వ్యక్తి రవికుమార్‌పై అనుమానంతో అక్కడే ఉన్న ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో సతీష్‌కుమార్‌తో పాటు విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరాజు, ఇతర సిబ్బంది రవికుమార్‌ను తనిఖీ చేసి 100 డాలర్లను అక్రమంగా తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు.
30 ఏళ్లుగా ఉన్న తాను మొదటిసారి తప్పు చేశానని, వదిలేయాలని ఆయన అధికారులను వేడుకున్నారు. దీనిపై అదే రోజున పరకామణి ఏవీఎస్‌ఓ తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.