Intermediate Practical Exams : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థులకు వచ్చిన మార్కులను బోర్డు పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియ మాత్రమే సీసీ కెమెరా నిఘా నీడలో జరిగేది. ఈ సారి ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించే సుమారు 900 ల్యాబుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఇంటర్‌బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య స్పష్టంచేశారు. అంతేకాకుండా ఇంటర్ పరీక్షల నిర్వహణలో పలు కొత్త సంస్కరణలు అమలు పరుచనున్నారు.
2024 ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 5 నుంచి ఫైనల్ రాత పరీక్షలు జరగనున్నాయి. చాలా ప్రైవేటు, కార్పొరేటు కళాశాలల్లో యాజమాన్యం ప్రాక్టికల్స్ జరపడం లేదు. అయినా ఎక్కువ శాతం మంది విద్యార్థులకు అధిక మార్కులు వస్తున్నాయి. అధికారులను ఆయా యాజమాన్యాలు లంచాలిచ్చి మచ్చిక చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయకుండా సీసీ కెమెరాల నీడలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తే విద్యార్థులు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని పలువురు అధ్యాపకులు భావిస్తున్నారు.
లీకైతే వెంటనే గుర్తించేలా క్యూఆర్ కోడ్ :ఈసారి కొత్తగా ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్‌తోపాటు సీరియల్ నంబరును ఇంటర్ విద్యాశాఖ బోర్డు ముద్రించనుంది. ఒకవేళ ఏదైనా పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీకైతే ఆ సీరియల్ నంబరు ఆధారంగా వెంటనే ఎక్కడ లీకైందో గుర్తించేలా ఈ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్‌లో సైతం వివరాలు పొందుపరచనున్నారు. హాల్‌టికెట్లను గతంలో పరీక్ష వారం నుంచి పది రోజులు ఉందనగా విడుదల చేసేవారు. కానీ ఈ సారి మాత్రం నాలుగు వారాల ముందే జారీ చేయనున్నారు.