Agrigold Customers and Agents Welfare Association Protest: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. గాంధీ బొమ్మ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన అగ్రిగోల్డ్ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని, ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరావు ఆరోపించారు.
ఉదయగిరి, వరికుంటపాడు, కనిగిరి, దుత్తలూరు ప్రాంతాల్లోని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. విలువైన సంపద దోచుకుంటున్నా అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని సక్రమంగా స్పందించకపోవడం దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, అగ్రిగోల్డ్ సంపద కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన అగ్రిగోల్డ్ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతునన్నారు. ఈ అన్యాయంపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. మాకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ సంపదను దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలి.- ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్